
- ప్రజల విశ్వాసం కోల్పోవడం కాంగ్రెస్ లక్షణం
- కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండటమే ఆ పార్టీకి ప్రమాదకరం
- ఒకటి రెండు జిల్లాలు తప్ప.. ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించలేదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్అనే మూడక్షరాలే పవర్ఫుల్అని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ఖమ్మం లోక్‌సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్పోరాట పటిమ చూశారని, రానున్న రోజుల్లో కేసీఆర్అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కేసీఆర్అధికారంలో కన్నా ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్‌కు ప్రమాదకరమన్నారు. అధికారంలో ఉన్నప్పటి కన్నా మరింత పోరాట పటిమతో ప్రతిపక్షంలో పని చేస్తామన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని, పార్లమెంట్సమీక్షలు ముగిసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతి రెండు, మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామన్నారు. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలోనే కోల్పోయే లక్షణం కాంగ్రెస్‌పార్టీ సొంతమన్నారు. 1989లో ప్రజలు టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్‌ను గెలిపించారని, కేవలం ఏడాదిన్నరలోనే కాంగ్రెస్‌మీద ప్రజలు విశ్వాసం కోల్పోయి లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే నిజాయతీ, చిత్తశుద్ధి కాంగ్రెస్‌పార్టీకి లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో జాప్యం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు.
తక్కువ మెజార్టీతో ఓడిపోయినం..
అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే బీఆర్‌ఎస్‌పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని, అందుకు 39 సీట్లలో గెలవడమే నిదర్శనమన్నారు. ఇంకో11 స్థానాల్లో తక్కువ మెజార్టీతోనే ఓడిపోయామన్నారు. బీఆర్ఎస్పై ప్రజల్లో ఎందుకు అసంతృప్తి పెరిగిందో సమీక్షించుకొని ముందుకు సాగుదామన్నారు. పార్టీ పరంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆత్మవిమర్శ చేసుకుంటున్నామని తెలిపారు. పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో దళితబంధు పూర్తి స్థాయిలో ఇచ్చిన కమల్‌రాజ్‌కు ఓట్లు పడలేదన్నారు. కొందరు కార్యకర్తలు పార్టీ కమల్రాజ్గొంతు కోసిందని అంటున్నారని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. కమల్రాజ్కే కాదు అభ్యర్థులందరికీ పార్టీ టికెట్‌తో పాటు రూ.40 లక్షలు ఇచ్చామని, ఆయనకు అన్నిరకాలుగా అండగా నిలిచామన్నారు. కమల్రాజ్ఈ ఒక్కసారే కాదు 4సార్లు ఓడిపోయారన్నారు. 2018లో ఆయన ఓడిపోయినా ఖమ్మం జడ్పీ చైర్మన్పదవి ఇచ్చామన్నారు.
ప్రజలే ప్రభుత్వంపై చీటింగ్‌కేసులు పెడ్తరు: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటికీ వంద రోజుల డెడ్లైన్పెడుతోందని, అప్పటికీ సంక్షేమ పథకాలు అందకపోతే ప్రభుత్వంపై ప్రజలే చీటింగ్ కేసులు పెడుతారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తాము హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండమని, కార్యకర్తల దగ్గరికే వస్తామన్నారు. నాలుగు రోజులు ఓపిక పడితే, మళ్లీ బీఆర్ఎస్కు బంగారు పల్లెంలో పెట్టి అధికారం ఇస్తారన్నారు. ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు గ్రూపులున్నాయని, ఒకటి వైఎస్సార్‌కాంగ్రెస్, రెండు టీడీపీ కాంగ్రెస్, ఇంకోటి ఒరిజినల్ కాంగ్రెస్ అన్నారు. ఆ మూడు గ్రూపులతో జిల్లాకు మంచి జరగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు. కేసీఆర్అలాగే ఆలోచించి ఉంటే కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండేవారన్నారు.