మాది ఫైటర్ల జాతి..మేం గిరిగీసి కొట్లాడే తెగువ ఉన్నోళ్లం: కేటీఆర్‌‌‌‌

మాది ఫైటర్ల జాతి..మేం గిరిగీసి కొట్లాడే తెగువ ఉన్నోళ్లం: కేటీఆర్‌‌‌‌
  • మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచినం
  • కేసీఆర్​ ఏనాడూ  జాతిపిత అని చెప్పుకోలేదు.. ప్రజలే పిలుచుకున్నరు
  • తెలంగాణ ఆనవాళ్లే కేసీఆర్​..అవి ఎట్ల చెరిపేస్తరు? అని ప్రశ్న

హైదరాబాద్​, వెలుగు: తమది ఫైటర్ల జాతి అని, గిరిగీసి కొట్లాడే సత్తా ఉన్నోళ్లమని బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్​అన్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, తమ నాయకుడు కేసీఆర్‌‌‌‌ను అడ్డగోలుగా తిడుతున్నారని మండిపడ్డారు.  కేసీఆర్‌‌‌‌ను ఏ జాతికి పితవు అని అడుగుతున్నారని, మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి తమదని చెప్పారు.

తెలంగాణలో రెండే జాతులున్నాయని, ఒకటి తెలంగాణవాదుల జాతి అని, ఇంకోటి తెలంగాణ ద్రోహుల జాతి అని అన్నారు. తాను జాతిపితనని కేసీఆర్​ ఏనాడూ చెప్పుకోలేదని, ప్రజలే అలా పిలుచుకున్నారని తెలిపారు. మంగళవారం తెలంగాణభవన్‌‌లో నిర్వహించిన బీఆర్‌‌‌‌ఎస్‌‌ చీఫ్‌‌ కేసీఆర్​ బర్త్​ డే వేడుకల్లో హరీశ్‌‌రావుతో కలిసి కేటీఆర్‌‌‌‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌‌‌‌ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం జెండా ఎత్తినప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే కేసీఆర్​ సాహసం, చరిత్ర తెలుస్తుందని అన్నారు. మీడియా, మనీ, మజిల్​ పవర్స్​ లేకుండానే టీడీపీ, కాంగ్రెస్​ పార్టీని ఢీకొట్టి దుస్సాహసమే చేశారన్నారు.

తెలంగాణ నినాదంలోని న్యాయం, ధర్మం మాత్రమే కేసీఆర్‌‌‌‌ను మొండి ధైర్యంతో ముందుకు నడిపించాయన్నారు. కేసీఆర్‌‌‌‌ను బెస్ట్​ అజిటేటర్​.. బెస్ట్​ అడ్మినిస్ట్రేటర్​ అంటూ అరుణ్​ జైట్లీ కొనియాడారని గుర్తుచేశారు. 

తెలంగాణ మట్టితో మమేకమైనోడికే తెలుస్తది

తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి మాత్రమే జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుందని కేటీఆర్​ అన్నారు. ప్రాణాలకు తెగించి కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు.. సమైక్యాంధ్రవాదుల సంచులు మోసిన సన్నాసులకు జాతి, నీతి తెల్వదని అన్నారు.

 ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తదని అడిగారు. ‘‘రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్, జంగల్, జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పుపాతర వేస్తామన్న కాళోజీ జాతి మాది.

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని చెప్పిన దాశరథి జాతి మాది. 1952లో ‘గైర్ ముల్కీ గో బ్యాక్’ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 1969లో కర్కశ కాంగ్రెస్‌‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి 369 మంది అసువులు బాసిన యువ కిశోరాల జాతి మాది”అని వ్యాఖ్యానించారు.  రక్తంలో పౌరుషం ఉంటే, డీఎన్ఏలో ఉద్యమం ఉంటే.. ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా  శరీరంలో ఉంటే  జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తదని అన్నారు. 

ఉద్యమం పుట్టిన రోజు: హరీశ్‌‌రావు

ఇది ఒక నాయకుడి పుట్టినరోజు కాదని, ఉద్యమం పుట్టినరోజు అని మాజీ మంత్రి హరీశ్‌‌రావు అన్నారు. ఆత్మగౌరవంతో ఈ జాతి బతుకుతున్నదంటే దానికి కారణం కేసీఆర్​అని తెలిపారు. కేసీఆర్​ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేదా? అని ప్రశ్నించారు. ఎంతో మంది ఉద్యమం చేసినా గమ్యాన్ని చేరుకోలేకపోయారన్నారు. ‘‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’’ అని ఎత్తిన జెండా దించకుండా కేసీఆర్​ నినదించారని చెప్పారు.

‘‘ఒక కౌన్సిలర్ పదవి కోసం కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాలు, పొత్తులు చూశాం. కానీ కేసీఆర్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించిండు. ఆ త్యాగం, ఆ ధైర్యం లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు.

కేసీఆర్ తిన్నన్ని తిట్లు, పడినన్ని పాట్లు, ఆయనపై జరిగిన కుట్రలు చరిత్రలో ఏ నాయకుడి మీద జరిగి ఉండకపోవచ్చు. ఏ ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రాణాన్ని సైతం వదిలేందుకు సిద్ధపడ్డడు. కేసీఆర్ ఉద్యమ కారుడు, కేసీఆర్ చరిత్ర కారుడు, పాలనాదక్షుడు అని చరిత్ర పుటల్లో నిలిచింది.  కేసీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా చరిత్రే’’ అని వ్యాఖ్యానించారు.