6 నెలల పదవి కోసం ఇంత అవసరం లేదు

6 నెలల పదవి కోసం ఇంత అవసరం లేదు

మంత్రి జగదీష్ రెడ్డి పై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయంగా లబ్ధి పొందిన వారు మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారు... కానీ వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారని ఎద్దేవా చేశారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్...  తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల మనసులో ఉన్నాడన్నారు. ప్రతి గ్రామాల్లోనూ ఆయన జయంతి, వర్థంతి ఉత్సవాలు ప్రజలే చేస్తున్నారని చెప్పారు.

పార్టీ కార్యక్రమాలను కూడా సొంత కార్యక్రమాల్లాగా అనుకుంటే వాళ్లకు నష్టం తప్పదని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తనని పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి పిలవకపోవడమంటే మునుగోడు నియోజకవర్గం ప్రజలను అవమానించడమేనని ఆరోపించారు. మునుగోడు టికెట్ అనేది అంత ముఖ్యమైనది కాదని, 6 నెలల పదవి కోసం ఇంత అవసరం లేదని విమర్శించారు. ఒకాయన (మంత్రి) పిలవనంతమాత్రాన తన స్థాయి తగ్గదని, వారి స్థాయి పెరగదని చెప్పారు. అహంకారం అనేది వారి సొంత సమాధికి పునాది లాంటిదన్నారు. వ్యక్తిగత ఆహ్వానాలు, చిల్లర రాజకీయాల కొరకు తాను ఉండనని, తనకు కేసీఆర్ ఒక్కడే నాయకుడని, మిగతా లిల్లీపుట్స్ ను పట్టించుకోనన్నారు.