
- ప్రమాదం హృదయ విదారకం: కేటీఆర్
- ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రమాదం: హరీశ్
హైదరాబాద్, వెలుగు: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై మాజీ సీఎం, బీఆర్ఎస్అధినేత కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 17 మంది మృతి చెందడం మనసును కలచివేసిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్సఅందించాలన్నారు.
మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.
బాధితులు త్వరగా కోలుకోవాలి: కేటీఆర్
గుల్జార్ హౌస్ ప్రమాదం హృదయవిదారకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంపై లోతుగా విచారణ జరిపించాలన్నారు. ఓల్డ్‌సిటీతో పాటు హైదరాబాద్ సిటీలో అగ్ని భద్రతా చర్యలను బలోపేతం చేయాలని, అగ్నిమాపక సామర్థ్యాన్ని పెంచాలని సూచిస్తున్నామని చెప్పారు.
ముందస్తు వ్యూహం అమలు చేయలే: హరీశ్
అగ్నిప్రమాదంలో సామాన్యులు మృతి చెందడం బాధను కలిగించిందని హరీశ్‌రావు అన్నారు. వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నదన్నారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం అమలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శించారు. ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధలవుతున్నారన్నారు. గుల్జార్ హౌస్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.