సాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారణ చెల్లదు... కాళేశ్వరం కమిషన్‌‌ రిపోర్టు పై హైకోర్టు లో కేసీఆర్‌‌ లాయర్‌‌ వాదన

సాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారణ చెల్లదు... కాళేశ్వరం కమిషన్‌‌ రిపోర్టు పై హైకోర్టు లో కేసీఆర్‌‌ లాయర్‌‌ వాదన
  •     తదుపరి విచారణ మార్చి 2కు వాయిదా 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఏర్పాటైన జస్టిస్‌‌ పి.సి.ఘోష్‌‌ కమిషన్‌‌ అప్పటి మాజీ సీఎం కేసీఆర్ ను సాక్షిగా పిలిచి అనంతరం దోషిగా నిర్ధారించిందని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వ రికార్డులను ఆధారంగా చేసుకుని ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం చెల్లదన్నారు. కమిషన్‌‌ ఇచ్చిన నివేదికలోని వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా పవర్‌‌ పాయింట్‌‌ ద్వారా మీడియాకు వెల్లడించడం రాజకీయ దురుద్దేశంలో భాగమేనన్నారు. దీన్ని కొనసాగిస్తే కేసీఆర్‌‌ వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని, కమిషన్‌‌తోపాటు నివేదికను రద్దు చేయాలని కోరారు. 

కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్‌‌ పి.సి.ఘోష్‌‌ కమిషన్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాలు చేస్తూ.. కేసీఆర్, హరీశ్‌‌రావు, ఐఏఎస్‌‌ స్మితా సభర్వాల్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్‌‌ జోషి వేర్వేరుగా పిటిషన్‌‌లు దాఖలు చేశారు. వీటిపై  చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం విచారణ చేపట్టింది. 

కేసీఆర్‌‌ తరఫున సీనియర్‌‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ఘోష్‌‌ కమిషన్‌‌ను నియమించినప్పుడు విధివిధానాలను పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని.. వాటికి విరుద్ధంగా కమిషన్ విచారణ చేపట్టిందన్నారు. కేసీఆర్‌‌ను సాక్షిగా విచారణకు పిలిచి.. నిందితుడిగా విచారణ చేపట్టిందన్నారు. కేసీఆర్‌‌ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి రూ.7,500 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొందన్నారు. ప్రభుత్వం సమర్పించిన రికార్డుల ఆధారంగా కమిషన్‌‌ ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు. 

రాజకీయ కారణంతోనే కమిషన్ ఏర్పాటు 

పిటిషనర్‌‌ కు సెక్షన్‌‌ 8 బీ, సీ ప్రకారం నోటీసు ఇచ్చి, వివరణ కోరాల్సి ఉన్నా అలా చేయలేదని శేషాద్రినాయుడు కోర్టుకు తెలిపారు.ప్రస్తుతం కేసును సీబీఐకి అప్పగించామని, అందువల్ల ఈ పిటిషన్‌‌పై విచారణ నిష్ఫలమన్న వాదన సరికాదన్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా సీఎం, మంత్రులు మీడియాకు పవర్‌‌ పాయింట్‌‌ ప్రజంటేషన్‌‌ ఇచ్చారన్నారు. పిటిషనర్‌‌కు కాపీ ఇవ్వకుండానే మీడియాకు వెల్లడించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్నారు. అందుకే ఈ కమిషన్‌‌తోపాటు అది ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరారు. 

ఐఏఎస్‌‌ స్మితా సభర్వాల్‌‌ తరఫున సీనియర్‌‌ న్యాయవాది వాదిస్తూ.. ఆమె నిబంధనలకు అనుగుణంగానే విధులు నిర్వహించారని.. ఎలాంటి ఆరోపణలూ లేవన్నారు. జోషి తరఫున న్యాయవాది వాదిస్తూ.. ఆరోపణలు చేసే ముందు వివరణ తీసుకోలేదన్నారు. ప్రతివాదుల వాదన కోసం విచారణను కోర్టు మార్చి 2కు వాయిదా వేసింది.