మిడ్ మానేరు నీళ్లు కాదు.. వాళ్ల కన్నీళ్లు చూడండి

మిడ్ మానేరు నీళ్లు కాదు.. వాళ్ల కన్నీళ్లు చూడండి

కోనరావుపేట, వెలుగుమిడ్​మానేరులో నీళ్లనుకాదని.. ముంపు గ్రామాల నిర్వాసితుల కళ్లలో కన్నీళ్లను చూడాలని కాంగ్రెస్​ సీనియర్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, వారి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని నిలదీశారు. సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్​ నేతలను ముందస్తుగా అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. అలా అదుపులోకి తీసుకుని కోనరావుపేట పోలీస్​స్టేషన్​లో ఉంచిన పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షుడు కూస రవీందర్, బాలగొని శ్రీనివాస్ గౌడ్ తదితరులను జీవన్ రెడ్డి, కాంగ్రెస్​ వేములవాడ నియోజకవర్గ ఇన్​చార్జి ఆది శ్రీనివాస్  సోమవారం పరామర్శించారు. తర్వాత జీవన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తారా? ఇలా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయించడం నియంత పాలనకు నిదర్శనం. మిడ్ మానేరు నిర్వాసితులు ఉపాధి లేక ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకునేందుకు ఐదున్నర లక్షల చొప్పున ఇస్తామన్న సీఎం హామీ ఇప్పటివరకు అమలు చేయలేదు. సీఎం బంధువులైన జోగినపల్లి సంతోష్ కుమార్ కుటుంబాలకు ఏ ప్యాకేజీ ఇచ్చారో నిర్వాసితులకు అదే ప్యాకేజీ ఇవ్వాలి. నిర్వాసితుల సమస్యల తీరే వరకు ప్రాజెక్టు వద్దే ఉంటా, ఇక్కడే తింటా, ఇక్కడే పడుకుంట అని సీఎం అన్నరు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. ” అని జీవన్​రెడ్డి మండిపడ్డారు.

రాజన్న ఆలయ అభివృద్ధి ఎప్పుడు?

పేదల దైవం వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్​ హామీ ఏమైందని జీవన్​రెడ్డి ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ నాలుగేండ్ల కింద చేసిన ప్రకటనను మరోసారి రాజన్న సాక్షిగా గుర్తు చేసుకోవాలన్నారు. అప్పటికి ఇప్పటికి గుడి, పరిసరాలు అలాగే ఉన్నాయని చెప్పారు. యాదాద్రికి ఇచ్చే ప్రాధాన్యత వేములవాడకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. అకాల వర్షాలకు వరి, పత్తి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. ఎలక్షన్ల ముందు రైతు బంధు ఇచ్చారని, ఇప్పుడు 30 శాతం మందికి డబ్బులు అందలేదని చెప్పారు. కాగా.. ప్రజాభిప్రాయాన్ని ఎన్నాళ్లు అణచి వేస్తారని ఆది శ్రీనివాస్​ పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ ​చేశారు.