కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్లక్ష్యం.. నల్లగొండ, పాలమూరుకు తీరని అన్యాయం: సీఎం రేవంత్

కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్లక్ష్యం.. నల్లగొండ, పాలమూరుకు తీరని అన్యాయం: సీఎం రేవంత్
  • పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీని పట్టించుకోలే..
  • ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నల్లగొండకు నీళ్లిస్తం
  • గ్రీన్ చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తం
  • 42 కి.మీ టన్నెల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేదు
  • గ్రావిటీ ద్వారా నాలుగు వేల క్యూసెక్కులు తరలిస్తం
  • తక్కువ ఖర్చుతో 30 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తం
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్/మహబూబ్ నగర్: కృష్ణా ప్రాజెక్టులను పదేండ్లు పాలించిన కేసీఆర్ పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన  ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేని ప్రారంభించారు. తొలిరోజు సర్వేను స్వయంగా పరిశీలించారు. అనంతరం నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారి పల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఎస్ఎల్బీసీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. 

ఇందుకోసం గ్రీన్ చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఇవాళ ప్రారంభించిన  ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే  టన్నెల్  తవ్వడంలో కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. మిలిటరీ టెక్నాలజీ అని అన్నారు. రెండున్నర మీటర్ల ముందుగానే లోపల ఉన్న మట్టి పరిస్థితిని వివరిస్తుందని ముందుకు వెళ్లొచ్చా..? లేదా..? అనేది ఇండికేట్ చేస్తుందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లతో టన్నెల్ పూర్తి చేస్తామని సీఎం చెప్పారు. 

టన్నెల్ పూర్తి అయితే గ్రావిటీ ద్వారా నాలుగు వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లొచ్చని అన్నారు. ప్రపంచంలో 42 కిలో మీటర్ల టన్నెల్ లేదని అన్నారు. ఇంత తక్కువ ఖర్చుతో 30 టీఎంసీల నీటిని తీసుకెళ్లనున్నట్టు  చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు 1983లో మంజూరు అయిందని సీఎం అన్నారు. నలభై ఏండ్లు దాటినా ఇప్పటి వరకూ పూర్తి కాలేదని చెప్పారు. గత  ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ ప్రాజెక్టును పూర్తి చేయలేదని అన్నారు.  పాలమూరు జిల్లాకు చెందిన తాను సీఎంగా, నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నామని, ఈ ప్రాజెక్టు ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ పూర్తి కాదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగినందునే తెలంగాణ ఉద్యమం వచ్చిందని సీఎం అన్నారు. 

తెలంగాణ రాష్ట్రం  ఏర్పడ్డ తర్వాత కూడా ప్రాజెక్టు పూర్తి కాలేదంటే కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుందని అన్నారు.  తెలంగాణ  ఏర్పడేనాటికి 30 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయిందని కానీ కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో మిగతా 10 కి.మీ టన్నెల్ పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టులో కమీషన్ కూడా రాదని కేసీఆర్, హరీశ్ రావు ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టారని ఆరోపించారు. ఏపీలో జగన్ ప్రభుత్వంపోతిరెడ్డిపాడును విస్తరిస్తుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకున్నారని ధ్వజమెత్తారు. రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే నల్గొండ జిల్లాకు నీరు అందేది కదా అని అని ప్రస్నించారు. 

గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కేసీఆర్ ప్రభుత్వం రూ. 1.86 లక్షల కోట్లు చెల్లించింది. ఇందులో రూ. 1.06 లక్షల కోట్లు కేవలం కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించిందని విమర్శించారు. కృష్ణానదిమీద చేపట్టిన అన్ని ప్రాజక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 27 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్తున్న కేసీఆర్ ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదని విమర్శించారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు. 

హరీశ్ చిల్లర మాటలు మానుకో

హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలని, తప్పులు చేసి అప్పులు చేసి దోపిడీ చేశారనే ప్రజలు  బీఆర్ఎస్ ను పక్కన పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 86 వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చిందని సీఎం అన్నారు. అందులో 1 లక్షా 5 వేల కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేశారని చెప్పారు. 

కృష్ణాలో మన వాటా మనం తీసుకోకపోవడం వల్ల ఆ నీటిని ఆంధ్రా తరలించుకు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 299 టీఎంసీలు చాలు అని ఆనాడు హరీష్ సంతకం పెట్టి వచ్చారని గుర్తు చేశారు. మన వాటా మనకు దక్కాల్సిందేనని ట్రిబ్యునల్ లో దీనిపై తాము వాదనలు వినిపిస్తూ ఒక కొలిక్కి తీసుకొస్తున్నామని చెప్పారు.  ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఇక్కడి ప్రజలు తమను క్షమించరని, ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తామని సీఎం చెప్పారు. 

డిసెంబర్ 31 లోగా ముంపు బాధితుల సమస్య పరిష్కారం

ఎల్ఎల్బీసీ కారణంగా ముంపునకు గురవుతున్న మర్లపాడు, కేశ్య తండా, నక్కలగండి తండా ప్రజలను ఆదుకుంటామని సీఎం చెప్పారు.  డిసెంబర్ 31 లోగా సమస్యలు పరిష్కరించే బాధ్యత తమదని అన్నారు.