మార్కెట్లో ధర వచ్చే పంటలే వేయాలి

మార్కెట్లో ధర వచ్చే పంటలే వేయాలి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కంట్రోల్డ్‌ వ్యవసాయ విధానం ఏటా, ప్రతి సీజన్ లో ఉంటుందని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఈ వానాకాలం నుంచే అమల్లోకి వస్తుందని, మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలే పండించాలని స్పష్టం చేశారు. ప్లాన్​ సిద్ధం చేయాలని అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ ను ఆదేశించారు. రైతుల ప్రయోజనం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో పంటల సాగుపై సీఎం కేసీఆర్ మూడు రోజులుగా ప్రగతిభవన్ లో వ్యవసాయ శాఖ అధికారులు,  ఎక్స్‌‌‌‌పర్టులతో చర్చలు జరిపారు. పలు సూచనలు చేశారు. ప్రజలు ఏది పడితే అదే తింటున్నారని, అలా కాకుండా బలవర్ధకమైన పంటలు పండిస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్తాయని కేసీఆర్ పేర్కొన్నారు.

అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, రీసెర్చ్, కాటన్​ రీసెర్చ్​​పై కమిటీలు

ప్రజల ఆహార అలవాట్లపై కచ్చితమైన అంచనాలు రూపొందించేందుకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని.. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ఎంపికకు రీసెర్చ్ కమిటీ వేయాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రాంతానికి ఏ ఆహార పదార్థాల అవసరం ఉందో ఈ కమిటీ గమనించాలని.. డిమాండ్​ ఉన్న పంటలను సిఫార్సు చేయాలని ఆదేశించారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పంటల సాగు జరగాలని.. ఇది ఏటా కొనసాగాలని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఏ రకం పత్తి సాగు చేయాలన్నది సిఫార్సు చేసేందుకు కాటన్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పత్తి పంట ఎక్కువ పండిస్తున్నరు, పత్తిలో ఉత్పాదకత పెంచడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఏ రకమైన పత్తికి మార్కెట్ ఉంది, అలాంటి పత్తి సాగుకు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను అధ్యయనం చేసి సూచనలు చేయాలని చెప్పారు.

రివ్యూలో సీఎం సూచనలివీ..

  • రాష్ట్రంలో జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లుల కెపాసిటీ, సరిపోతాయా, ఇంకా అవసరమా అన్న దానిపై కచ్చితమైన అంచనాలు వేయాలి. పత్తి పంట పండే ప్రాంతాల్లోనే వాటిని నెలకొల్పాలి.
  • రాష్ట్రంలో ఏ నేలలు ఏ పంట సాగుకు అనువో తేల్చి..పంటలు వేయించాలి. పంటల కాలనీల కోసం నేలల విభజన చేయాలి. ఈ వివరాలను రైతులకు తెలపాలి.
  • పండ్లు, కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నం. పండ్లు, కూరగాయలు ఎంత మేర దిగుమతి చేసుకుంటున్నమో లెక్క తీయాలె. వాటిని రాష్ట్రంలోనే పండించేందుకు ప్లాన్​ అమలు చేయాలి.
  • ఆలుగడ్డ, అల్లం, ఎల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నం. ఇక్కడే పండించేలా చర్యలు చేపట్టాలి. వాటిలో మేలైన సాగు పద్ధతులపై రైతులకు మార్గదర్శనం చేయాలి.
  • ఉల్లిగడ్డల లభ్యత, ధరల విషయంలో ఏటా అనిశ్చితి ఉంటది. అలా ఉండొద్దు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు జరగాలి. ఎప్పుడూ కొరత లేకుండా చూసే ప్లాన్​ అమలు చేయాలి.
  • చిక్కుడు, మునగ ఎక్కువగా తినేలా ప్రజలను చైతన్య పరచాలి. సాగు పెంచాలి.

పంట నమోదుకు ప్రత్యేక పోర్టల్‌‌‌‌

రైతులు, సర్వే నంబర్​వారీగా ప్రతి గుంట భూమిలో వేసిన పంట వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ‘క్రాప్‌‌‌‌ ఏరియా సోన్‌‌‌‌  మాడ్యూల్‌‌‌‌’తో ప్రత్యేక పోర్టల్‌‌‌‌ అభివృద్ధి చేశారు. ఏఈవోలతో ఈ పోర్టల్‌‌‌‌లో వివరాలు నమోదు చేయించేందుకు చీఫ్‌‌‌‌ స్టాటికల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ బాధ్యతలను వ్యవసాయ శాఖ అడిషనల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ విజయ్​కుమార్‌‌‌‌ను అప్పగించారు.

సరిపడా పీపీఈ కిట్లు లేవు..డేంజర్లో డాక్టర్లు