
దేశంలో బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్లు లలిత్ మోదీ, విజయ్ మాల్యా లగ్జీరీ పార్టీలు చేసుకుంటున్నారు. లండన్ లో లలిత్ మోదీ ఇచ్చిన సమ్మర్ పార్టీలో విజయ్ మాల్యా పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. లండన్‌లో లలిత్ మోడీ ఇటీవల నిర్వహించిన లగ్జరీ పార్టీలో విజయ్ మాల్యా పాట పాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లలిత్ మోడీ లండన్‌లోని తన నివాసంలో వార్షిక వేసవి పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి 310 మందికి పైగా స్నేహితులు,కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పార్టీలో నిర్వహించిన కారొకే సెషన్ లో లలిత్ మోడీ, విజయ్ మాల్యా ఇద్దరూ కలిసి పాటలు పాడారు.
ALSO READ : పాకిస్తాన్కు మైక్రోసాఫ్ట్ గుడ్బై..25 ఏళ్ల తర్వాత కార్యకలాపాల మూసివేత
అమెరికన్ సింగర్ ఫ్రాంక్ సినాట్రా పాడిన ప్రసిద్ధ పాట "ఐ డిడ్ ఇట్ మై వే" ని ఉత్సాహంగా పాడారు లలిత్ మోదీ, విజయ్ మాల్యా. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఈ పార్టీలో పాల్గొని లలిత్ మోడీ, విజయ్ మాల్యాలతో కలిసి ఫోటోలు దిగారు. క్రిస్ గేల్ కూడా తన సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేశారు.
లలిత్ మోడీ స్వయంగా ఈ పార్టీకి సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలు "ఈ వీడియో ఇంటర్నెట్‌ను బ్రేక్ చేయదని ఆశిస్తున్నా. కచ్చితంగా ఇది వివాదాస్పదమే. కానీ నేను చేసేది అదే" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయబడ్డాయి. ఇది లలిత్ మోదీ, విజయ్ మాల్యాల ధిక్కార వైఖరిని స్పష్టం చేస్తుందని నెటిజన్లు అంటున్నారు.
భారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి లండన్‌లో తలదాచుకుంటున్న ఈ ఇద్దరు ప్రముఖులు ఇలా బహిరంగంగా విలాసవంతమైన పార్టీలలో పాల్గొనడం, పాటలు పాడటంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.