IND VS ENG 2025: సెంచరీ కొట్టకపోయినా చరిత్రే.. టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఏకైక ప్లేయర్‌గా జడేజా రికార్డ్

IND VS ENG 2025: సెంచరీ కొట్టకపోయినా చరిత్రే.. టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఏకైక ప్లేయర్‌గా జడేజా రికార్డ్

టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు వయసుతో పాటు ఫామ్ కూడా పెరుగుతుంది. మూడేళ్ళుగా టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న ఈ టీమిండియా ఆల్ రౌండర్ సుదీర్ఘ ఫార్మాట్ లో నిలకడగా రాణిస్తూ తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో జడేజా ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ ఒకటి తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 2000 పరుగులు చేయడంతో పాటు 100 వికెట్లను పడగొట్టి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. 

ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన రెండో టెస్టులో 89 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా.. ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ కు ముందు టెస్ట్ ఛాంపియన్ లో 2000 పరుగులు పూర్తి చేయడానికి ఈ టీమిండియా ఆల్ రౌండర్ కు 79 పరుగులు అవసరం కాగా జడేజా 89 పరుగులు చేసి ఈ ఫీట్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో 89 పరుగులు చేసి టీమిండియా కెప్టెన్ గిల్ తో 203 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను ఆదుకున్నాడు. 

ఓవరాల్ గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో జడేజా 41 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్ లో 40 యావరేజ్ తో 2010 పరుగులు చేయగా..వీటిలో మూడు సెంచరీలు.. 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లోనూ అద్భుతంగా రాణించి 132 వికెట్లను పడగొట్టాడు. వీటిలో 6 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. 2022 నుంచి జడేజా టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఆల్ రౌండర్ ఇన్నేళ్ళపాటు నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగడం జడేజాకే సాధ్యమైంది. ఎవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. 

ALSO READ : బంగ్లాతో టీమిండియా సిరీస్ రద్దు.. రోహిత్, కోహ్లీని చూసేది అప్పుడే!

మార్చి 2022 నుండి రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు. ఈ మూడేళ్ళ కాలంలో 23 టెస్ట్ మ్యాచ్‌లలో బ్యాటింగ్ లో 36.71 సగటుతో 1,175 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లో తన గణాంకాలతో జడేజా ఆకట్టుకున్నాడు. 22.34 సగటుతో 91 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ఘనత ఆరు సార్లు తీశాడు. ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన సందర్భాలు రెండు ఉన్నాయి.