బ్రహ్మోస్ నూర్‌ఖాన్ బేస్ తాకగానే గుండె ఆగింది.. 30 సెకన్లలో మతిపోయింది: పాక్ అధికారి

బ్రహ్మోస్ నూర్‌ఖాన్ బేస్ తాకగానే గుండె ఆగింది.. 30 సెకన్లలో మతిపోయింది: పాక్ అధికారి

భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ గుండెలపై చేసిన గాయాలు వారాలు గడుస్తున్నా అక్కడి అధికారులను వెంటాడుతూనే ఉన్నాయి. మిలియటరీ ఉద్రిక్తతల సమయంలో భారత్ తన బ్రహ్మోస్ మిసైల్ఉపయోగించి పాకిస్థాన్ లోని నూర్‌ఖాన్ బేస్ పై దాడిచేసినట్లు అక్కడి సీనియర్ ప్రభుత్వ అధికారి తాజాగా అంగీకరించారు. నాలుగు రోజులు కొనసాగిన పరస్పర దాడుల్లో ఇది చాలా కీలకమైన మలుపుగా మారింది. ఈ దాడి పూర్తి స్థాయి అణు దాడికి దారితీస్తుందేమో అని వారు భయబడినట్లు తేలింది. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఇండియా పాక్ మధ్య అణు యుద్ధాన్ని నివారించాయని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పెషల్ అసిస్టెంట్ రాణా సనాఉల్లా ఖాన్ చెప్పారు. భారత్ నూర్ ఖాన్ బేస్ మీద బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినప్పుడు పాక్ ప్రభుత్వం దానిని అనలైజ్ చేసేందుకు కేవలం 30 నుంచి 45 సెకన్ల సమయం మాత్రమే ఉందని చెప్పారు. మిసైల్ ఏదైనా అణు బాంబును కలిగి ఉందా అని నిర్థారించుకోవాటికి అర నిమిషం సమయమే మిగిలిందన్నారు. ఈ దాడి పాకిస్థాన్ వ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. 

భారత్ అణు ఆయుధాలను మెుదట ప్రయోగించకుండా బాధ్యతగా వ్యవహరిస్తుందని తెలిసినప్పటికీ తమకు తక్కువ సమయం ఉండటంతో అది అణు వార్ హెడ్ అని అపార్థం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఇది పరోక్షంగా అణు యుద్ధానికి దారితీసేదని చెప్పారు. ఒకవేళ అణు దాడి జరిగితే ఎంత ప్రమాదకరమో ఊహించటానికి భయంగా ఉందని ఖాన్ చెప్పారు. ఆ సమయంలోనే యుద్ధాన్ని నివారించటానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకంగా వ్యవహరించారంటూ చెప్పుకొచ్చారు. 

భారత్ మాత్రం పాక్ డీజీఎంఓ కాల్ చేసి కాల్పుల విరమణను కోరిందని చెబుతుంటే.. ఖాన్ మాత్రం ట్రంప్ లేకుంటే ప్రపంచం ప్రమాదంలో పడేదంటూ పాత కథ మళ్లీ చెప్పారు. దీనికి ముందు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ట్రంప్ కి శాంతి దూతగా నోబెల్ బహుమతి ఇవ్వాలని ఆఫర్ చేశారు. పాక్ రక్షణకు అత్యంత కీలకమైన ఎయిర్ బేస్ నూర్ ఖాన్ రాజధాని ఇస్లామాబాద్ కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అణు కార్యకలాపాల పర్యవేక్షణ, భద్రపరిచే కార్యాలయానికి ఇది అత్యంత సమీపంలో ఉండటం కూడా పాకిస్థాన్ కి చెమటలు పట్టించింది.