ఎప్ స్టీన్ ను చంపేశారు!.. ఫోరెన్సిక్ డాక్టర్ మైకేల్ బైడెన్

ఎప్ స్టీన్ ను   చంపేశారు!.. ఫోరెన్సిక్ డాక్టర్ మైకేల్ బైడెన్

వాషింగ్టన్:  లైంగిక నేరస్థుడు, ఆర్థికవేత్త జెఫ్రీ ఎప్ స్టీన్  2019లో న్యూయార్క్  జైలులో ఆత్మహత్య చేసుకోలేదని, ఆయన గొంతు నులిమి చంపి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ డాక్టర్  మైకేల్  బేడెన్  తెలిపారు. ఎప్ స్టీన్  కుటుంబం తరపున బేడెన్  గతంలో పోస్టుమార్టం పరిశీలకుడిగా హాజరయ్యారు. మృతుడి మెడలో మూడు ఎముకలు విరిగినట్టు అధికారిక నివేదికలో నమోదు అయ్యింది. హయోయిడ్  ఎముకతో పాటు థైరాయిడ్  కార్టిలేజ్ కు చెందిన రెండు ఎముకలు దెబ్బతిన్నట్టు పోస్టుమార్టంలో తేలింది.

తన 50 ఏళ్ల వైద్య అనుభవంలో ఉరివేసుకుని చనిపోయిన కేసుల్లో ఇలాంటి గాయాలు చూడలేదని బేడెన్ అన్నారు. అప్పట్లోనే ఇది హత్యకు సంకేతమని వ్యాఖ్యానించారు.  కాగా, న్యూయార్క్  వైద్య పరీక్షల కార్యాలయం.. ఎప్ స్టీన్  మృతిని ఆత్మహత్యగా తేల్చింది. జైల్లో జరిగిన భద్రతా లోపాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని బేడెన్  పేర్కొన్నారు. ఎప్ స్టీన్  గదిలో అదనపు దుప్పట్లు, దుస్తులు ఉన్నాయని, వాటిలో  ఉరితాడు లాగా తయారు చేశారని నివేదికలు వెల్లడించాయి.