బంద్ రోజు చర్చలేంది?..సమ్మె ఆపితేనే చర్చలు

బంద్ రోజు చర్చలేంది?..సమ్మె ఆపితేనే చర్చలు
  • ఎక్కడికక్కడ అరెస్టులు చేయండి
  • ప్రతి బస్సుకు ఇద్దరు కానిస్టేబుల్స్
  • సమ్మె విరమిస్తేనే వారితో చర్చలు
  • బంద్​ జరగనివ్వకండి: కేసీఆర్​
  • అన్ని బస్సులు నడపాలని సూచన
  • మంత్రి పువ్వాడ, రవాణా శాఖ కార్యదర్శితో సీఎం భేటీ
  • హైకోర్టు ఆదేశాలపై ఆరా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సంతృప్తి

హైదరాబాద్, వెలుగు:   రాష్ట్ర బంద్‌‌ పేరిట అన్నీ బంద్‌‌ పెట్టాలనుకుంటున్న ఆర్టీసీ కార్మిక సంఘాలతో శనివారం చర్చలు జరిపేది లేదని, వారితో చర్చలను కూడా బంద్‌‌ చేయాలని సీఎం కేసీఆర్‌‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. రాజకీయ పార్టీల మద్దతుతో కార్మిక సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్‌‌ పిలుపును నిర్వీర్యం చేయాలని, తద్వారా వారికి ప్రజల మద్దతు లేదనే విషయాన్ని ప్రచారం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌‌, ఆ శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ సునీల్‌‌ శర్మతో శుక్రవారం రాత్రి సమావేశమైన సీఎం కేసీఆర్‌‌ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా బంద్‌‌ను నిర్వీర్యం చేయడంపై సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. బంద్‌‌ ప్రభావం ఎక్కడా కనిపించొద్దని, ఆందోళనకారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు సమాచారం. సమ్మె విరమించేదాకా కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పినట్టు తెలిసింది.

వంద శాతం బస్సులు నడపాలి

బంద్​ ఉందని బస్సులను నడపకుండా ఉండొద్దని, డిపోల్లో ఉన్న వంద శాతం బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది.అవసరమైతే బస్సుకో ఇద్దరు కానిస్టేబుళ్లను పెట్టి అన్ని రూట్లలో నడిపించాలని, బస్సులను అడ్డుకున్నా.. దుకాణాలను మూసివేయించానా అక్కడికక్కడ అరెస్టులు చేయాలని సూచించినట్లు సమాచారం. ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో పోలీస్‌ బందోబస్తును పటిష్టం చేయాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. రోడ్డెక్కే నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. సమ్మె ప్రభావం లేకుండా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కొనసాగించాలని సూచించినట్లు తెలిసింది. సమ్మె విరమిస్తేనే 48 వేల మంది కార్మికుల గురించి ఆలోచన చేద్దామని, అప్పటి వరకు మెట్టు దిగొద్దని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదు

ఇప్పటివరకు హైకోర్టు ఎక్కడా ప్రభుత్వ తీరును తప్పపట్ట లేదన్న అభిప్రాయంతో సీఎం ఉన్నట్టు తెలిసింది. విలీనం విషయంలో కోర్టు ఏ కామెంట్​చేయకపోవడం మంచి పరిణామమని ఆయన అన్నట్టు సమాచారం. విలీనం అనే డిమాండ్​పక్కనపెట్టి చర్చలకు కార్మిక సంఘాల నేతలు వచ్చి ఉంటే సమ్మెకంటే ముందే చర్చలు జరిపేవారమని ఆయన అన్నట్టు తెలిసింది. ఇప్పటికే చాలామంది కార్మికులు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, ఏ కండిషన్​పెట్టినా మెజార్టీ కార్మికులు వస్తారని సీఎం అంచనాకు వచ్చారని తెలిసింది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు బాగున్నాయి

సమ్మె ప్రారంభమైన రెండు మూడు రోజులపాటు తక్కువ సంఖ్యలో బస్సులను నడిపించామని, గత రెండు మూడు రోజులుగా 95 శాతం బస్సులను తిప్పుతున్నామని ఆర్టీసీ అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రభావం అసలే లేదని, పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే అభిప్రాయానికి సీఎం వచ్చారని తెలిసింది. సోమవారం నుంచి విద్యాసంస్థలు పనిచేస్తాయని, అప్పుడు స్టూడెంట్లకు ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం ఆదేశించారని సమాచారం.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి