సారు మారిండా..? రొటీన్​కు భిన్నంగా సిద్దిపేటలో కేసీఆర్ స్పీచ్

సారు మారిండా..?  రొటీన్​కు భిన్నంగా సిద్దిపేటలో కేసీఆర్ స్పీచ్

రాజకీయ విమర్శలు లేకుండా సాగిన ప్రసంగం

సొంత పార్టీ నేతలను ఇంప్రెస్​​ చేసే ప్రయత్నం

వేదిక మీదున్న అందరినీ మెచ్చుకున్న సీఎం

ఆణిముత్యం అంటూ హరీశ్​కు కితాబు

గ్రేటర్​ రిజల్ట్స్​ ఎఫెక్ట్​తోనే ఈ మార్పా?

హైదరాబాద్​, వెలుగు: సీఎం కేసీఆర్ రొటీన్ కు భిన్నంగా సిద్దిపేట టూర్ లో కనిపించారు. సభలు, సమావేశాల్లో అన్నీ తానై అన్నట్లు వ్యవహరించే ఆయన ఈసారి  తన టీమ్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మంత్రులను, పార్టీ లీడర్లను కలుపుకుపోయేందుకు ప్రాధాన్యమిచ్చారు.  దీంతో గ్రేటర్​ ఎన్నికల రిజల్ట్ తో  సీఎం కేసీఆర్ లో మార్పు వచ్చిందా..? అనే చర్చ టీఆర్​ఎస్​ నాయకుల్లోనే వ్యక్తమవుతోంది.  హైదరాబాద్​ ఎన్నికలయ్యాక సీఎం తొలి పర్యటన ఇదే కావటం గమనార్హం.

సిద్దిపేట వేదికపై  దాదాపు 20 నిమిషాల పాటు సీఎం మాట్లాడారు. రాజకీయాలు, ప్రతిపక్షాల ఊసెత్తకుండానే సీఎం ప్రసంగం సాగింది.  తాను పుట్టి పెరిగిన ప్రాంతం గురించి, ప్రభుత్వ గొప్పల గురించి చెప్పడంతోపాటు కొత్త వరాలు ప్రకటించారు. సిద్దిపేట గొప్పదనాన్ని, సిద్దిపేటకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి రోజులను యాదికి తెచ్చుకున్నారు. దోస్తులను, సన్నిహితులను గుర్తుచేసుకున్నారు. వేదికపై ఉన్న మంత్రులు, లీడర్ల పేర్లను పదేపదే ప్రస్తావించారు. వారిని పొగడ్తల్లో ముంచెత్తారు. ఇందుకోసమే సీఎం ఎక్కువ టైమ్​ కేటాయించారు. మంత్రి హరీశ్​రావును ఆణిముత్యం అంటూ ఆయన ఆకాశానికెత్తారు. బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామంటూ.. అదే వేదిక మీదున్న మంత్రి ఈటల రాజేందర్​ను పిలిచి అందరికీ పరిచయం చేశారు.

నవ్వుతూ.. నవ్విస్తూ..

గ్రేటర్​ ఎన్నికలకు ముందు జనగాం జిల్లా కొడకండ్లలో రైతు వేదిక  ప్రారంభించిన సీఎం.. అక్కడి పబ్లిక్​ మీటింగ్​లో అటు జనంపై, ఇటు ప్రతిపక్షాలపై రుసరుసలాడారు. అప్పటితో పోలిస్తే సీఎం మాట్లాడే తీరు మారిపోయింది. సిద్దిపేట బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్ రొటీన్ కు భిన్నంగా సాగింది. తాను నవ్వుతూ.. అక్కడి వారిని నవ్విస్తూ, సొంత పార్టీ లీడర్లను ఇంప్రెస్​  చేస్తూ ఆయన ప్రసంగం కొనసాగింది. ‘‘నాకు గొప్ప కల ఉండే ఆ రోజుల్లో. ఆ కలలు ఆల్​మోస్టు నెరవేరినయ్​. గ్యాదరి బాలమల్లు, రాధకృష్ణ శర్మకు అప్పట్ల మీసాలు కూడా లేకుండె. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి.. నేనేమో ఈడ పోటీ చేసి ఓడిపోయిన. ఎన్టీఆర్ కరీంనగర్ కు పోతుంటే సిద్దిపేటలో ఆపి, అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయించి, సిద్దిపేటను జిల్లా చేయాలని అడిగినం’’ అని అన్నారు. అప్పుడు అనేక కారణాల వల్ల జిల్లా ఏర్పాటు కాలేదని, సొంత రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్​ వివరించారు. ఉద్యమ సమయంలో రసమయి బాలకిషన్​తోపాటు చాలా మంది లీడర్లతో కలిసి రంగనాయక సాగర్ గుట్టల్లో టూవీలర్ పై తిరిగామన్నారు. సిద్దిపేటకు ప్రకటించిన ఆరోగ్య, ఆర్ అండ్ బీ శాఖకు చెందిన పనులను వెంటనే పూర్తయ్యేలా చూడాలని మంత్రులు ఈటల రాజేందర్, ప్రశాంత్ రెడ్డిని అప్పీలు చేస్తున్నట్టు సీఎం అడిగారు. జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి బాగా పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు.

సెక్యూరిటీ అత్యుత్సాహం

గెస్ట్ హౌస్​ ఓపెనింగ్ టైమ్ లో రిబ్బన్ కట్ చేసేందుకు సీఎం కేసీఆర్ వస్తున్న టైంలో మంత్రి హరీశ్ రావును సెక్యూరిటీ ఆఫీసర్ పక్కకు తోసేశారు. దీంతో హరీశ్ రావు షాక్ గురైనట్టు కనిపించింది. ఈ విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్.. ఓ క్షణం అక్కడే నిలబడి తనతోపాటు రావాలని హరీశ్​కు చేయి చూపించడంతో హరీశ్ కేసీఆర్ వెంట లోపలికి వెళ్లారు. కాస్త ముందుకు వెళ్లాక తనను నెట్టి వేసిన సెక్యూరిటీ ఆఫీసర్​ వైపు హరీశ్ సీరియస్ గా చూసినట్టు కనిపించింది.

హరీశ్ ఆణిముత్యం

మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌ను సీఎం కేసీఆర్ ఆణిముత్యంతో పోల్చారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేసిన టైంలో అందరం ఏడ్చామన్నారు. ‘‘సిద్దిపేట నుంచి నేను వెళ్లేటప్పుడు నా అంత పనిచేసే మనిషి ఇక్కడోళ్లకు కావాలని.. మంచి ఆణిముత్యంలాంటి నాయకుడు హరీశ్​ను మీకు అప్పగించిన. ఇవాళ ఆ పిల్లోడు కూడా నాపేరు కాపాడి.. అద్భుతమైన సిద్దిపేట తయారు చేసిండు. దీన్ని చూస్తూ నాగుండెల నిండా సంతోషం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘హరీశ్ బాగా హుషారున్నడు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏం అడగనని చెప్పిండు. రిబ్బన్లు కట్​ చేసిపోతే చాలన్నడు. ఇక్కడికి వచ్చినంక మీ ముందు నిలబెట్టి.. ఇవన్నీ ఇస్తవా.. చస్తవా.. అన్నట్లు చేసిండు. ఏం చేస్తమిగ.. దొడ్లకు వచ్చిన గోద పెండ పెట్టదా..!  సిద్దిపేట అంటే నా ప్రాణం కదా ’’ అని సీఎం అన్నారు.

దండాలు.. కౌగిలింతలు

కేసీఆర్ ప్రసంగం పూర్తయిన తర్వాత మంత్రి హరీశ్ రావు కేసీఆర్ కాళ్లు మొక్కారు. వెంటనే హరీశ్ ను కేసీఆర్ కౌగిలించుకున్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ కూడా సీఎం కాళ్లు మొక్కారు. సీఎం పర్యటన మొదలు నుంచి బహిరంగ సభ పూర్తయ్యే వరకు హరీశ్ చాలా హుషారుగా కనిపించారు. సభా వేదికపై కూడా ఆయన నవ్వు ముఖంతో కనిపించారు. సీఎం ప్రసంగం ప్రారంభ సమయంలో హరీశ్ ను ఆణిముత్యంతో పొగడటంతో  తను కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చి హరీశ్ కేసీఆర్ కు కాస్త దూరంలో, ప్రజలకు కనిపించే విధంగా నిలబడ్డారు. దాదాపు పావుగంట వరకు అలాగే నిల్చున్న హరీశ్ ను చూసి కేసీఆర్ కూర్చోమని చెప్పడంతో ఆయన వెళ్లి తన ప్లేస్​లో కూర్చున్నారు.

కేటీఆర్ మినహా మిగతా మంత్రులు హాజరు

సిద్దిపేట ప్రోగ్రాంలో సీఎం కేసీఆర్ ప్రారంభించే పనులకు ఆ శాఖలకు సంబంధించిన మంత్రుల్లో కేటీఆర్ మినహా మిగతా మంత్రులంతా  హాజరయ్యారు. మెడికల్ కాలేజీ ప్రారంభం కోసం ఆ శాఖకు చెంది న మంత్రి ఈటల రాజేందర్, రైతు వేదిక ప్రారంభం కోసం వ్యవసా య శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభానికి హౌసింగ్​ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కానీ ఐటీ టవర్  శంకుస్థాపస కోసం మాత్రం ఆ శాఖ మంత్రి కేటీఆర్ హాజరు కాలేదు.