స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు

స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు

అట్టడుగు వర్గాల్లో ఇంకా ఆక్రోశం కనిపిస్తోంది: కేసీఆర్​
స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ప్రసంగం


హైదరాబాద్ :  దేశంలో ఇప్పటికీ పేదల ఆశలు నెరవేరని పరిస్థితులు ఉన్నాయని, అనేక వర్గాల ప్రజలు మాకు స్వాతంత్ర్య ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. వాటిని విస్మరించి.. దేశాన్ని ఉన్మాద స్థితిలో నెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు  వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ మాట్లాడారు. దేశంలో అట్టడుగు వర్గాల ప్రజల్లో ఆక్రోశం ఇంకా కనిపిస్తున్నదని అన్నారు. అద్భుతమైన వనరులు ఉన్న ఈ దేశం, అనుకున్న విధంగా అభివృద్ధి జరగడం లేదని పేర్కొన్నారు. వీటన్నింటిని చూస్తూ మౌనం వహించడం సరైంది కాదని..  అర్థమై కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదన్నారు. ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తామో.. ఆ సమాజం గొప్పగా పురోగమించేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. 

స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి
స్వాతంత్ర్యం ఊరికే రాలేదని, ఎంతో మంది మహనీయుల ఆత్మబలిదానాలతో వచ్చిందని కేసీఆర్​ గుర్తు చేశారు. అదే పోరాట స్ఫూర్తితో కులం, మతం, జాతి భేదం లేకుండా.. పేద, ధనిక తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘కరోనా లాంటివి వస్తుంటాయ్‌‌‌‌‌‌‌‌.. పోతుంటాయ్‌‌‌‌‌‌‌‌. 75 ఏండ్లుగా స్వతంత్ర భారతంలో జరుగుతున్న విషయాలను గుర్తుచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ముఖ్యంగా యువకులు, మేధావులు, ఆలోచనాపరులు ఈ విషయాలు గ్రహించాలి” అని సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా ఎల్బీ స్టేడియానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శంకర్​ మహాదేవన్​ పాటలతో పాటు ఇతర  ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు