ఉచితాల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నరు

ఉచితాల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నరు

సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే నెలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. మళ్లీ కరెంట్ ఛార్జీలు భారీగా పెంచేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామంటే బీజేపీ వ్యతిరేకించలేదన్నారు. ప్రజల్లో విష బీజాలు నాటేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని..ఉచితాల పేరుతో ప్రజలకు హామీలను ఇస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

డిస్కంలకు బకాయిలు ఎందుకు కట్టలేదు?

డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు ఎందుకు కట్టలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి  సంజయ్ ప్రశ్నించారు. 60 వేల కోట్లకుపైగా డిస్కంలు నష్టాల్లో ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 20 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉందన్నారు. డిస్కంలకు డబ్బులు చెల్లించకపోవడంతో ఉత్పత్తి సంస్థలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కరెంట్ ను ఉత్పత్తి చేసే అవకాశాలు తగ్గుతాయన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయితే దేశం మొత్తం అంధకారం అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం సీఎం సొంత ఆస్తులను పెంచుకుంటన్నారన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి డిస్కంలకు17వేల కోట్లకుపైగా చెల్లించాలన్నారు. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బ్యాంకులు లోన్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. 

కేసీఆర్ ఫామ్ హౌస్ కు ఫ్రీ కరెంట్

సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఫ్రీ కరెంట్ వినియోగిస్తూ....సెప్టెంబర్ లో ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. పవర్ ఎక్సేంజ్ పేరుతో విద్యుత్ ను కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతుందని..ఇలా చేస్తే ఏ  రోజుకో ఆ రోజు  ధర నిర్ణయిస్తారన్నారు. బకాయిలు సకాలంలో కట్టకపోవడంతో ప్రజలపై భారం పడే ప్రమాదం ఉందన్నారు. ఒక్క ఓల్డ్ సిటీలోనే 5వేల కోట్లకుపైగా బిల్లులు కట్టాల్సి ఉందన్నారు. ఇష్టం వచ్చినట్టు కరెంట్ కొనుగోళ్లు వద్దని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం చెప్పిందన్నారు. 

బకాయిల చెల్లింపుపై పొంతనలేని సమాధానాలు

డిస్కంలకు బకాయిల చెల్లింపుపై  ప్రభుత్వం, అధికారులు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పే మాటలకు పొంతన లేదన్నారు. ఫ్రీ కరెంట్ ఇవ్వకుండా కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెన్ కో,ట్రాన్స్ కో లో  50 వేలకు మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారని వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందన్నారు. ఒకటో తారీఖున రావాల్సిన శాలరీలు..10వ తేదీ వరకు రావడం లేదన్నారు. గతంలో పెంచిన కరెంట్ ఛార్జీలతో 6 వేల కోట్ల ఆదాయం వచ్చిందని..మళ్లీ పెంచితే మరో 4 వేల ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. జెన్ కో, ఎన్టీపీసీ, సింగరేణి, ప్రైవేటు విద్యుత్ సంస్థలకు ఉన్న అప్పులెంతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  డిస్కంలకు బకాయిలు కట్టకుండా.. కేంద్రంపై ఆరోపణలు చేస్తూ కేసీఆర్ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని తెలిపారు.

అమిత్ షా సభను విజయవంతం చేయాలి

మునుగోడులో రేపు జరగబోయే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ప్రజలకు పాదాభివందనమే కాదు... పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈసారి మునుగోడు ప్రజలంతా బీజేపీవైపే ఉన్నారన్నారు. మునుగోడులో ఓటుకు 30 వేలిచ్చి గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు.