ఉత్సవాలకు కేసీఆర్​ను ఆహ్వానించినం

ఉత్సవాలకు కేసీఆర్​ను ఆహ్వానించినం
  • ఏడాది పాటు విమోచన వేడుకలు: కిషన్ రెడ్డి
  • ఆయన వస్తడో, రాడో క్లారిటీ రాలేదని వెల్లడి
  • నేడు పరేడ్ గ్రౌండ్​లో అమిత్ షా సభ 
  • హాజరు కానున్నమహారాష్ట్ర, కర్నాటక సీఎంలు

హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి ఊరిలోనూ జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఏడాది పాటు విమోచన ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్  పరేడ్ గ్రౌండ్‌‌లో మొదటిసారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ఈ ప్రోగ్రామ్ కు  సీఎం కేసీఆర్ ను ఆహ్వానించామని, ఆయన హాజరుపై స్పష్టత రాలేదని చెప్పారు. వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారని, మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు ఏక్‌‌నాథ్ షిండే, బస్వరాజ్ బొమ్మైతో పలువురు కర్ణాటక మంత్రులు హాజరవుతారని తెలిపారు. శుక్రవారం పరేడ్‌‌ గ్రౌండ్ లో విమోచన ఉత్సవాల ఏర్పాట్లను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన పరిశీలించారు. నిజాం వ్యతిరేక పోరాట యోధుల ఫొటో ఎగ్జిబిషన్ ను వారు పరిశీలించారు. తర్వాత వివేక్ వెంకటస్వామి, చింతల రామచంద్రారెడ్డితో కలిసి పరేడ్ గ్రౌండ్ లో మీడియాతో కిషన్​రెడ్డి  మాట్లాడారు. శనివారం ఉదయం‌‌ 8.30 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపానికి అమిత్ షా నివాళులర్పిస్తారని, తర్వాత జాతీయ పతాకాన్ని  ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేస్తారని, అక్కడే సర్దార్ పటేల్ కు నివాళులర్పించనున్నారని వివరించారు. తర్వాత పారా మిలటరీ పరేడ్ ఉంటుందని, ఇందులో‌‌ రెండు మహిళల బృందాలతో పాటు పది జనరల్ బృందాలు పాల్గొంటాయన్నారు. ఎన్ సీసీకి చెందిన 75 మంది మహిళలు, మరో 75 మంది పురుషులు కవాతులో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలను  ఆహ్వానించామని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 1,200 మంది సాంస్కృతిక కళా బృందాలు ఇందులో పాల్గొంటాయన్నారు. తెలంగాణ  కళా బృందాలను విమోచన దినోత్సవంలో భాగస్వామ్యం చేశామన్నారు.  పరేడ్ గ్రౌండ్ లో ఉత్సవాలు ముగిసిన తర్వాత బోయినపల్లిలోని క్లాసిక్ గార్డెన్ లో వికలాంగులకు అమిత్ షా ఉపకరణాలు అందజేస్తారని కిషన్​రెడ్డి  చెప్పారు. శనివారం ఉదయం 7.30 గంటలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పిస్తారని తెలిపారు. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.  పాదయాత్రలో ఉన్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ శనివారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని 7. 30కి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్ కు చేరుకొని విమోచన ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అమిత్ షా టూర్ సందర్భంగా శనివారం యాత్రకు సంజయ్ విరామం ఇచ్చారు. ఆదివారం నుంచి  యాత్ర సాగనుంది.

పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లను పరిశీలించిన లీడర్లు
పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న  తెలంగాణ విమోచన సభ ఏర్పాట్లను బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, అర్విద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, విజయశాంతి వేర్వేరుగా పరిశీలించారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి లక్ష్మణ్, ఈటల రాజేందర్ పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈటల ఇంటికి వెళ్లనున్న అమిత్‌‌ షా
అమిత్ షా రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం ఈటల రాజేందర్‌‌ ఇంటికి వెళ్లనున్నారు. ఇటీవల ఈటల రాజేందర్‌‌  తండ్రి మరణించారు. అమిత్‌‌ షా మధ్యాహ్నం 3.05 గంటలకు మేడ్చల్‌‌ జిల్లా ఔటర్‌‌ రింగ్‌‌రోడ్‌‌ సమీపంలోని పోడూరులోని ఈటల ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. 3.15 ఈటల ఇంటి నుంచి బయలుదేరి 3.45 గంటలకు నేషనల్‌‌ పోలీస్‌‌ అకాడమీలోని అమరవీరల స్మారక చిహ్మం వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నేషనల్‌‌ పోలీస్‌‌ అకాడమీలో శిక్షణకు సంబంధించిన యాక్టివిటీపై నిర్వహించే ప్రజంటేషన్‌‌లో పాల్గొంటారు. సాయంత్రం 6కు రాజ్ భవన్ కు వెళ్తారు.