ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్​లో కేసీఆర్ : హరీశ్

ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్​లో కేసీఆర్ :  హరీశ్
  • మేం తెచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేస్తున్నది
  • ఏడాదిలోనే ప్రజల తిరుగుబాటు తప్పదని కామెంట్

హైదరాబాద్, వెలుగు :  మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్​ త్వరలోనే ప్రజల్లోకి వస్తారని మాజీ మంత్రి హరీశ్​రావు చెప్పారు. శనివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన పెద్దపల్లి లోక్​సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే కేసీఆర్​ పూర్తిగా కోలుకుని ప్రజల మధ్యకు వస్తారని, ఆ తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తారని హరీశ్ రావు తెలిపారు. ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్​లో కార్యకర్తలు, ప్రజలకు కేసీఆర్ అందుబాటులో ఉంటారని చెప్పారు. ‘‘కేసీఆర్​ కిట్’​పై కేసీఆర్ ​ఫొటోను కాంగ్రెస్​ ప్రభుత్వం తొలగిస్తున్నది. కేసీఆర్ ​ఫొటోను తొలగిస్తారేమో గానీ, ప్రజల గుండెల్లో నుంచి ఆయనను తొలగించలేరు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తున్నది. కాంగ్రెస్​ సర్కార్ అంటేనే ‘రద్దు.. వాయిదా’ అన్నట్టుగా నడుస్తున్నది. కాంగ్రెస్​ ప్రభుత్వ విపరీత చర్యలపై ఉద్యమిస్తాం. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోంది” అని అన్నారు. ‘‘బీఆర్ఎస్ ​కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలందరం కలిసి బస్సు యాత్ర చేస్తాం.

కార్యకర్తలకు అండగా నిలుస్తాం.. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం” అని చెప్పారు. తెలంగాణ కోసం తాము పదవులకు రాజీనామాలు చేశామే తప్ప ఎక్కడా రాజీ పడలేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో వడ్లు అమ్మిన రైతులకు ఇంకా డబ్బులు వేయలేదని, రైతుబంధు సాయం రిలీజ్​ చేయడం లేదని.. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారంతోనే మనం ఓడిపోయాం. ఇది స్పీడ్ ​బ్రేకర్​ మాత్రమే. ప్రధాన ప్రతిపక్షంగా మన సత్తా ఏంటో చూపిద్దాం. పెద్దపల్లి లోక్​సభ సీటు గెలిచేందుకు సమష్టిగా పని చేయాలి. మున్ముందు మంచి రోజులు వస్తాయి. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే పార్టీ నడుస్తుంది” అని అన్నారు.