రాష్ట్రానికి నిధులివ్వండి..మోడీకి కేసీఆర్​ విజ్ఞప్తి

రాష్ట్రానికి  నిధులివ్వండి..మోడీకి కేసీఆర్​ విజ్ఞప్తి
  • నీతి ఆయోగ్‌‌‌‌ సిఫార్సులు అమలు చేయాలి
  • హైకోర్టు జడ్జిల సంఖ్య 22 నుంచి 42కు పెంచాలి
  • ఐఐఎం, ఐఐఎస్‌‌‌‌ఈఆర్‌‌‌‌, బయ్యారం స్టీల్​ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
  • ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి..   బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు పెంచాలి 
  • 22 అంశాలతో ప్రధానికి వినతిపత్రం
  • అమిత్​ షా, రాజ్​నాథ్​తోనూ భేటీ

న్యూఢిల్లీ, హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రానికి నిధులివ్వాలని, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని ప్రధాని నరేంద్రమోడీని సీఎం కేసీఆర్​ కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర అన్ని విధాలుగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఐదో విడతగా రూ. 450 కోట్లు రావాల్సి ఉందని, త్వరగా వాటిని ఇప్పించాలన్నారు. నీతి ఆయోగ్‌‌ సిఫార్సుల మేరకు మిషన్‌‌ కాకతీయకు రూ. 5 వేల కోట్లు, మిషన్​ భగీరథకు రూ. 19,205 కోట్లు విడుదల చేయాలని కోరారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్‌‌  భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన 22 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. 50 నిమిషాల పాటు ప్రధానితో  వివిధ అంశాలపై చర్చించారు.  మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో కేసీఆర్​ భేటీ కావడం ఇదే తొలిసారి. ముందుగా ప్రధానికి సీఎం అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్ర హైకోర్టులో జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలని ప్రధానికి  సీఎం విజ్ఞప్తి చేశారు. ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మేనేజ్​మెంట్​ (ఐఐఎం)ను, ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ సైన్స్‌‌ ఎడ్యుకేషన్‌‌ అండ్‌‌ రీసెర్చ్‌‌ (ఐఐఎస్‌‌ఈఆర్‌‌)ను ఏర్పాటు చేయాలని కోరారు.

అమిత్​షా, రాజ్​నాథ్​తోనూ భేటీ

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌‌ షా, రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్‌‌సింగ్‌‌తోనూ సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర హోం శాఖ కార్యాలయంలో అమిత్​ షాను ఆయన కలిశారు. దాదాపు అరగంటకుపైగా సాగిన ఈ  సమావేశంలో వారిద్దరూ కీలక అంశాలు చర్చించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలతో పాటు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు ఆర్థిక సహకారం అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అమిత్​ షాతో ఏ ఏ అంశాలపై చర్చించారని మీడియా ప్రశ్నించగా..  కాళేశ్వరానికి జాతీయ హోదాతోపాటు, రాష్ట్రానికి కేంద్ర సాయం వరకూ అన్ని అంశాలపై కూలంకశంగా చర్చించినట్లు సీఎం చెప్పారు. సీఎం హోదాలో కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ కావడం ఇదే తొలిసారి. ఇటీవల నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్​ షా అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కేసీఆర్ హాజరుకాలేదు.

రక్షణ శాఖ స్థలాలు బదలాయించండి

రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్‌‌తో సీఎం కేసీఆర్  దాదాపు 15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ప్రధానంగా  రక్షణ శాఖ భూములపై చర్చించారు. కంటోన్మెంట్ ఏరియాలోని రక్షణ శాఖ స్థలాలను రాష్ట్రానికి బదలాయించాలని రాజ్​నాథ్‌​కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాజీవ్ రహదారి విస్తరణకు కంటోన్మెంట్ భూముల అప్పగింపుపై గతంలో సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని సీఎం వివరించారు. ఈ సమావేశంలో ఎంపీలు కేకే, సంతోష్, నామా నాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, దయాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకొని సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.

ప్రధానికి సీఎం చేసిన విజ్ఞప్తులు

  • ఆదిలాబాద్‌‌ జిల్లాలో గతంలో ఉన్న సిమెంట్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా ఇండస్ట్రీని నేషనల్‌‌ హైవేస్‌‌ అథారిటీ సహకారంతో తెరిపించాలి.
  • హైదరాబాద్​లో ఉన్న నేషనల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ డిజైన్‌‌ (ఎన్‌‌ఐడీ)ను గతంలో విశాఖకు తరలించారు. రాష్ట్రానికి ఎన్‌‌ఐడీని మంజూరు చేయాలి.
  • బయ్యారంలో స్టీల్‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి.
  • పీపీపీ పద్ధతిలో కరీంనగర్‌‌లో ట్రిపుల్‌‌ ఐటీ నెలకొల్పాలి.
  • రాష్ట్రంలోని పెండింగ్‌‌ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలి. అందుకు నిధులు ఇవ్వాలి.
  • నీతి ఆయోగ్‌‌ సిఫార్సుల మేరకు మిషన్‌‌ కాకతీయకు రూ. 5 వేల కోట్లు, మిషన్​ భగీరథకు రూ. 19,205 కోట్లు విడుదల చేయాలి.
  • జహీరాబాద్‌‌ నిమ్జ్‌‌కు నిధులు విడుదల చేయాలి.
  • రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పది నుంచి 33కు పెంచుకున్నాం. 31 గ్రామీణ జిల్లాలకు గాను 9 జిల్లాల్లోనే జవహర్‌‌ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. మిగతా 23 జిల్లాల్లోనూ వాటిని ఏర్పాటు చేయాలి.
  • ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దానిని అమలు చేయాలి.
  • పార్లమెంట్‌‌, అసెంబ్లీ సీట్లలో 33 శాతం సీట్లను మహిళలకు, ఓబీసీలకు రిజర్వ్‌‌ చేయాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది. దానిని అమలు చేయాలి.
  • రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి. ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లు కలిపి మొత్తంగా బీసీలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చొరవ తీసుకోవాలి.
  • హైదరాబాద్​–  నాగ్‌‌పూర్‌‌, వరంగల్​– హైదరాబాద్‌‌ ఇండస్ట్రియల్‌‌ కారిడార్‌‌ను అభివృద్ధి చేయాలి.
  • వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి పీఎంజీఎస్‌‌వై కింద రూ. 4 వేల కోట్లు కేటాయించాలి.
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రోడ్ల పనుల్లో ఖర్చును 60:40 నిష్పత్తిలో కాకుండా వంద శాతం కేంద్రమే భరించాలి.
  • సెంట్రల్‌‌ యూనివర్సిటీ తరహాలో వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో వరంగల్‌‌లో ట్రైబల్‌‌ వర్సిటీని నెలకొల్పాలి.
  • వరంగల్‌‌ టైక్స్‌‌టైల్‌‌ పార్క్‌‌కు రూ. వెయ్యి కోట్ల గ్రాంట్‌‌ ఇన్‌‌ ఎయిడ్‌‌ ఇవ్వాలి.
  • రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి.
  • ఎస్సారెస్పీ ఫ్లడ్‌‌ ఫ్లో కెనాల్‌‌కు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలి.

నోట్​లో ‘సెక్రటేరియట్’​ వచ్చే.. పాయె!

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్​ 23 అంశాలతో వినతిపత్రం అందజేశారంటూ శుక్రవారం సాయంత్రం నోట్​ విడుదల చేసిన సీఎంవో.. రెండు నిమిషాల్లోనే దాన్ని మార్చేసి మరో నోట్​ విడుదల చేసింది. మారిన నోట్​లో 22 అంశాలే ప్రధాని ముందు సీఎం ప్రస్తావించినట్లు తెలిపింది. మొదటి నోట్​లో 23వ అంశంగా.. కంటోన్మెంట్​ ఏరియాలో సెక్రటేరియట్ నిర్మాణం, జాతీయ రోడ్ల  విస్తరణ కోసం  రక్షణ శాఖ ఆధీనంలోని కంటోన్మెంట్ భూములను ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరినట్టు పేర్కొంది. ఉన్నట్టుండి నోట్​ను మార్చేసి.. అందులోంచి 23వ అంశాన్ని తొలగించడం చర్చనీయాంశమైంది. గతంలో కొత్త సెక్రటేరియట్​ను కంటోన్మెంట్​ ఏరియాలోనే కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి.. అప్పట్లో కేంద్రం దృష్టికి తెచ్చింది. రక్షణ శాఖ భూముల బదిలీ సాధ్యం కాకపోవడంతో ఇప్పుడున్న సెక్రటేరియట్​ను కూలగొట్టి కొత్తది కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గతంలో కేంద్రానికి ఇచ్చిన వినతిపత్రంలోని ‘కంటోన్మెంట్​ ఏరియాలో సెక్రటేరియట్’ అంశమే శుక్రవారం సీఎంవో మొదట విడుదల చేసిన 23 అంశాల నోట్​లోనూ వచ్చింది. ప్రింటింగ్​ మిస్టేక్ వల్లే  ఆ అంశం తాజా నోట్​లో వచ్చినట్లు  భావించిన అధికార వర్గాలు అటు తర్వాత ఆ అంశాన్ని తొలగించి కొత్త నోట్​ విడుదల చేశారు.