
- ఆర్టీసీ కార్మికుల బాధలు పట్టించుకోరేం
- ఉద్యమకారులంతా ఓవైపుంటే.. కేసీఆర్ కుటుంబం మరోవైపు ఉంది
- హరీశ్, ఈటల వంటివాళ్లు ఇప్పటికైనా బయటికి రావాలె
- సీఎంకు తగిన బుద్ధి చెప్పే టైం వచ్చిందని వివేక్ విమర్శ
ఆదిలాబాద్ అర్బన్, పెద్దపల్లి, వెలుగు:
సీఎం కేసీఆర్‍కు దోచుకోవడంపై, కమీషన్లపై ఉన్న ధ్యాస ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై లేదని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎలా బిల్లులు చెల్లించాలో, అందులో ఎన్ని కమీషన్లు దండుకోవాలోనని ఆలోచిస్తున్నారే తప్ప ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మిక సంఘాలను ఇరుకునపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కార్మికులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఎంపీ సోయం బాపూరావుతో కలిసి వివేక్ సంఘీభావం తెలిపారు. మహిళా కండక్టర్ల రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. తర్వాత మాట్లాడారు. ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులంతా ఓవైపు ఉంటే సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే మరోవైపు ఉందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు మనవాళ్లనే భావన లేకుండా సెల్ప్ డిస్మిస్ అయ్యారంటూ పెద్ద తుగ్లక్‍లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్‍కు సెల్ప్ డిస్మిస్ అనేదేదీ లేదన్న విషయం తేలియకపోవడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.
తగిన బుద్ధి చెప్పాల్సిందే..
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ వంటివారు ఇప్పటికైనా బయటికొచ్చి సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తేవాలని వివేక్ కోరారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న విషయాన్ని మరవొద్దని కేసీఆర్ కు హితవు పలికారు. కార్మికులు ఏమాత్రం భయపడొద్దని, సీఎంకు తగిన బుద్ధిచెప్పేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
మొండి వైఖరి వీడాలి
సీఎం కేసీఆర్‍కు సన్నిహితంగా ఉండే కొందరు సమ్మెపై ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ జరిగితే ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలను బంధువులను కట్టబెట్టుకోవడం కేసీఆర్ మోసపూరిత పాలనకు నిదర్శనమని చెప్పారు. 49వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తుంటే కేసీఆర్‍కు కన్పించడం లేదా అని నిలదీశారు. కేసీఆర్ దొరతనంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మొండి వైఖరి వీడి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని, కార్మికులు ఆందోళన చెందవద్దని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్, ఆర్టీసీ జేఏసీ నేతలు పాల్గొన్నారు.
కార్మికులకు పండుగ లేకుండా చేసిండు
సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు దసరా, దీపావళి పండుగలు లేకుండా చేశారని వివేక్ మండిపడ్డారు. గురువారం పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఆర్టీసీ కార్మికులకు దీక్షలకు సంఘీభావం తెలిపారు. సీఎం కేసీఆర్నియంతలా పాలిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు ధైర్యంగా పోరాడాలని, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించి నిలదీయాలని చెప్పారు.