తెలంగాణలో ఘోరం: 300 వీధి కుక్కల హత్య.. సర్పంచ్‌లతో సహా 9 మందిపై కేసు..

తెలంగాణలో ఘోరం: 300 వీధి కుక్కల హత్య.. సర్పంచ్‌లతో సహా 9 మందిపై కేసు..

తెలంగాణ హనుమకొండ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.  దాదాపు 300 వీధి కుక్కలను చంపిన కేసులో ఇద్దరు గ్రామ సర్పంచ్‌లతో సహా తొమ్మిది మందిపై పోలీసులు కేసు బుక్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... హనుమకొండ జిల్లాలోని శాయంపేట, ఆరెపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో పెద్ద సంఖ్యలో వీధి కుక్కలను చంపుతున్నారని ఆరోపిస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ శాయంపేట పోలీసులను ఆశ్రయించింది.

ఫిర్యాదు ప్రకారం, ఇద్దరు వ్యక్తులు కుక్కలకు పాయిజన్ ఇంజెక్షన్లు ఇచ్చారని, దింతో అవి చనిపోయాయని ఆరోపించారు. తరువాత చనిపోయిన వీధి కుక్కలను ఊరి చరిర్లో పడేశారని... జనవరి 6 నుండి జనవరి 8 మధ్య ఈ మూడు రోజులల్లోనే ఈ  ఘటనలు జరిగాయని చెప్పారు.

కుక్కలను ఎందుకు చంపారంటే : 
గ్రామ పెద్దల ప్రకారం  ప్రజల ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గ్రామాల్లో, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల కాలంలో వీధి కుక్కల సంఖ్య పెరగడం ఒక పెద్ద సమస్యగా మారిందని, అందుకే ఇలా చేసినట్లు  చెప్పారు. ఫిర్యాదు మేరకు పోలీసులు జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వారిలో శాయంపేట, ఆరెపల్లి సర్పంచ్‌లు అలాగే వారి భర్తలు, ఒక ఉప సర్పంచ్, ఇద్దరు గ్రామ కార్యదర్శులు, ఇద్దరు రోజు కూలీలు ఉన్నారు.

ALSO READ : BRS మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఐదు కోట్ల ఆస్తులు అటాచ్

అయితే, వీధికుక్కల సమస్యను పరిష్కరించడానికి మానవీయ చర్యలు తీసుకోవాలని ఆ NGO ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. నివేదికల ప్రకారం, చంపడానికి బదులుగా జంతువుల జనన నియంత్రణ కార్యక్రమాలు, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం అవసరమని  చెప్పింది. 

దేశవ్యాప్తంగా వీధికుక్క దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇదంతా జరిగింది. ఈ విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగా, జనవరి 9న  వీధికుక్కల దాడులపై విచారణను తిరిగి ప్రారంభించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాల వీడియోలు కుక్కలు చిన్నారులు, వృద్ధులపై దాడి చేస్తున్నట్లు చూపిస్తున్నాయని కోర్టు గమనించింది, అయితే ఈ సమస్యను జంతు హింస ఆందోళనలు,  కుక్కల దాడి కేసుల మధ్య ఘర్షణగా రూపొందించకూడదని చెప్పింది.  ప్రజా భద్రతను మెరుగుపరచడం, రాబిస్‌  నివారించే చర్యల్లో భాగంగా ఢిల్లీలోని వీధి కుక్కలను డాగ్ షెల్టర్స్ ప్రాంతాలకు తరలించాలని గత సంవత్సరం సుప్రీంకోర్టు ఆదేశించింది.