ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన

ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన

బీజేపీ నేతలవే కాదు TRS ముఖ్య నేతల ఫోన్ లు కూడా కేసీఆర్ ట్యాపింగ్ చేపిస్తున్నడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని IAS, IPS , ఇతర ముఖ్య అధికారుల ఫోన్ లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేపిస్తోందని చెప్పారు. బీజేపీపై కల్వకుంట్ల కుటుంబం విషప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని కిషన్ రెడ్డి అన్నారు. రోజూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న ఆయన.. కేసీఆర్ కుటుంబం జాతీయ పార్టీ పెట్టినట్లు, కేసీఆర్ పీఎం, ఆయన కూతురు కేంద్ర మంత్రి అయినట్టు కల్వకుంట్ల కుటుంబం పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎందుకు జాతీయ పార్టీ పెడుతున్నారు..  ఏం ఉద్దరించడానికి ప్రకటిస్తున్నారో, దాని సారాంశమేంటో అర్థం కాక టీఆర్ఎస్ నాయకులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రకటనకు ఆ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారని, కేసీఆర్ తీరును లోలోపల అసహ్యించుకుంటారన్నారు. మజ్లిస్ పార్టీని బలపర్చేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. విమానం రెంట్ కు తీసుకుందామని చెప్పి ఇప్పుడు విమానమే కొంటాం అంటున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారన్నారు. 

నెగిటివ్ ఆటిట్యూడ్ తో పెట్టిన ఏ పార్టీ బ్రతికి బట్ట కట్టలేదని కిషన్ రెడ్డి చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం అంధకారంలోకి రాబోతోందన్న ఆయన... తమను ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. వ్యతిరేకత పెరుగుతోందనే ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ అంటున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తన జాతీయ పార్టీపై తప్ప తన అవినీతి, కుటుంబం పై చర్చ ఉండకూడదనే కల్వకుంట్ల ఫ్యామిలీ ఓ కొత్త నాటకానికి తెర తీసిందని ఆరోపించారు. కేసీఆర్ కాళ్ల కింద భూమి కదిలి పోతుందని.. అందుకే ఇతర రాష్ట్రాల పేరుతో ప్రజలను మభ్య పెడుతోందని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబానికి కలలో కూడా జాతీయ దర్యాప్తు సంస్థలు ఈడి, సీబీఐ, ఐటీ లే గుర్తుకు వస్తున్నాయన్న కిషన్ రెడ్డి... వారి గురించి రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కథలు కథలుగా చెప్పుకుంటున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రంలో తొండి ఆట ఆడుతోందని... ఎప్పటికైనా టీఆర్ఎస్ తొండి ఆట ఓడిపోవడం ఖాయమని.. ధర్మం గెలవడం తథ్యమని స్పష్టం చేశారు.

తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావడం ఖాయమన్న కిషన్ రెడ్డి.. దళితుడు తెలంగాణను సమర్ఖ పాలన అందించలేడనే వారిని కేసీఆర్ వెన్నుపోటు పొడిచాడని చెప్పారు. జాతీయ పార్టీ పేరుతో తన వారసుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం... పార్టీలో అసమ్మతిని తగ్గించేందుకే జాతీయ పార్టీ అంటున్నారని విమర్శించారు. దేశంలో ఎంఐఎం, వైసీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఏఐఏడీఎంకే కూడా జాతీయ పార్టీలేనన్న ఆయన... దేశంలో జాతీయ పార్టీలు రావడం, పోవడం సాధారణమేనని చెప్పారు. తెలంగాణలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. పీకే కూడా టీఆర్ఎస్ పార్టీ ఎలాగూ గెలవదని పెట్టెపేడా సర్దుకుని పంపించారని.. బీజేపీ ఏజెంట్ అని కేసీఆర్ తనను తిప్పినట్టు పీకే ఆయన స్నేహితులకు చెప్పుకుంటున్నారంట అంటూ కామెంట్లు చేశారు. 

మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్న కిషన్ రెడ్డి... ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ప్రజలకు తెలుసునని చెప్పారు. మోటార్లకు మీటర్లు అని గతంలో కూడా అనేక సార్లు ప్రచారం చేశారు.. కాని ప్రజలు నమ్మలేదన్న ఆయన.. తమ ప్రభుత్వం మీటర్లు పెడతామని ఎప్పుడు చెప్పలేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి మీటర్లు ఖచ్చితంగా పెడతామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని పార్లమెంటరీ బోర్డు ప్రకటిస్తుందని.. ఇప్పటికే మునుగోడు ప్రజలకు తమ అభ్యర్థి ఎవరో ప్రజలకు స్పష్టం చేసామని కిషన్ రెడ్డి అన్నారు.