
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రజినీ కెరీర్‌లో ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తంగమ్, రాణా లాంటి పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ ‘కూలీ’ అనే టైటిల్‌ను ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్‌లో రజినీకాంత్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు లోకేష్ కనగరాజ్.
ఇంతవరకూ తన చిత్రాల్లో డ్రగ్స్ మాఫియాను ఎక్కువగా చూపించిన లోకేష్.. ఈసారి గోల్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తీస్తున్నట్టు గ్లింప్స్ ద్వారా అర్థమైంది. అభిమానులు ఆశించే రజినీకాంత్ మార్క్ డైలాగ్స్, తనదైన శైలి యాక్షన్ సీక్వెన్స్‌లతో బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో లోకేష్ ఈ టీజర్‌ను కట్ చేశాడు. మొత్తానికి ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నాగార్జున, శ్రుతిహాసన్ కీలకపాత్రలు పోషించబోతున్నట్టు ప్రచారంలో ఉంది. మరోవైపు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రంలో రజినీకాంత్ నటిస్తున్నారు.