ఫ్రీ కరెంట్ : ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్

ఫ్రీ కరెంట్ : ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్

ఢిల్లీ వాసులకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అర్వింద్ కేజ్రీవాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. 200 యూనిట్ల లోపు కరెంట్ ఉపయోగించేవారికి కరెంట్ బిల్లు ఉండదని చెప్పారు. ఫ్రీ లైఫ్ లైన్ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కింద ఈ నిర్ణయం ఇవాళ్టినుంచే అమలులోకి రానుందని చెప్పారు. 2019 ఆగస్ట్ నెల నుంచి ఢిల్లీలోని ఇళ్లలో నెల వారీగా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడిన వారికి బిల్లు ఉండదన్నారు అరవింద్ కేజ్రీవాల్. 201 నుంచి 400 యూనిట్ల లోపు కరెంట్ వాడితే.. వారికి ఢిల్లీ ప్రభుత్వం బిల్లులో 50% సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. ఆమ్ ఆద్మీకి ఇది తమ ప్రభుత్వం ఇచ్చే కానుక అన్నారు. ఐదేళ్లలో కరెంట్ చార్జీలు పెంచని ప్రభుత్వం ఇండియాలో తమది ఒక్కటే అన్నారు. ఇండియాలోనే ఇపుడు అతి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిసిటీ అందిస్తున్న రాష్ట్రం కూడా ఢిల్లీయే అన్నారు కేజ్రీవాల్.

ఈ పథకంతో ఢిల్లీలోని 33శాతం కుటుంబాలకు లబ్ది కలుగుతుందని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో చలికాలంలో కనీసం 70శాతం గృహవినియోగదారులకు ఈ పథకంతో లాభం ఉటుందని చెప్పారు. లైట్, ఫ్యాన్, ఫ్రిజ్, టీవీ ఇలా… చిన్నపాటి గృహోపకరణాలు ఉపయోగించే వారికి ఈ స్కీమ్ వరంలాంటిది అని చెప్పారు.

మరికొద్ది నెలల్లోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు జనం మనసులు గెల్చుకునేందుకు కేజ్రీవాల్ ఉచిత కరెంట్ పథకం ప్రకటించారని ప్రతిపక్షాలు అంటున్నాయి.