ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా

ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా

న్యూఢిల్లీ : ఢిల్లీ జల్ బోర్డులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు కేజ్రీవాల్ సోమవారం హాజరుకాలేదు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులోనూ ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనూ విచారణకు రావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను దాటవేస్తూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు ఈడీ నుంచి 8 సార్లు సమన్లు వచ్చినప్పటికీ విచారణకు పోలేదు.

ఈ నెల 21న హాజరుకావాల్సిందేనంటూ అధికారులు తొమ్మిదోసారి ఢిల్లీ సీఎంకు సమన్లు జారీ చేశారు. ఇవి చట్టవిరుద్ధం అంటూ ఆప్ సర్కారు చేసిన సవాల్​పై విచారణ కోర్టులో కొనసాగుతోంది. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు కావాలనే కేజ్రీవాల్​ను టార్గెట్​ చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.

కేజ్రీవాల్ లోక్​సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు ఈడీని వాడుకుంటోందని ఆరోపించింది. ఈడీ అధికారులు బీజేపీ ఎజెండాను అమలు చేయడం ఎప్పుడు ఆపేస్తారో అర్థంకావట్లేదని ఆ పార్టీ నేత గోపాల్ రాయ్ మండిపడ్డారు.