- కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: కేంద్రీయ విద్యాలయం ద్వారా విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన గుణాత్మక విద్య అందిస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం హాజీపూర్ మండలం గుడిపేటలో ప్రధానమంత్రి కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షిక క్రీడా దినోత్సవాలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టీచర్లు, స్టూడెంట్ల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన పాఠశాల నిర్వహణ కమిటీ ద్వారా విద్యార్థుల భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తూ అద్భుతాలు సృష్టించగలరని.. నాయకత్వ లక్షణాలు అలవడతాయని, కష్టపడి పని చేయడం, టీం వర్క్ అలవాటు అవుతుందన్నారు.
భవన నిర్మాణ పనుల పరిశీలన
నస్పూర్లో కొనసాగుతున్న బాలసదనం భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. బాలల సంరక్షణ కోసం రూ.కోటి 34 లక్షల మిషన్ వాత్సల్య నిధులతో నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పాత మంచిర్యాల ప్రాంతంలో కొనసాగుతున్న ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
