కస్టమర్ నిర్లక్ష్యం అని బ్యాంక్ తప్పించుకోలేదు: స్క్రాచ్ కార్డ్ మోసంలో కోర్టు సంచలన తీర్పు

కస్టమర్ నిర్లక్ష్యం అని బ్యాంక్ తప్పించుకోలేదు: స్క్రాచ్ కార్డ్ మోసంలో కోర్టు సంచలన తీర్పు

కేరళలో చోటుచేసుకున్న ఒక ఘటన డిజిటల్ లావాదేవీల సేఫ్టీపై చర్చకు తెరలేపింది. ఫెడరల్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తన కష్టార్జితాన్ని కోల్పోయాడు. అయితే వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు బాధితుడికి పూర్తి న్యాయం చేకూర్చింది. కొత్తగా జరుగుతున్న స్కాచ్ కార్డ్స్ మోసాలు ఏంటి, కస్టమర్ న్యాయం కోసం చేసిన ప్రయత్నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కస్టమర్ ఎలా మోసపోయాడు?
బాధితుడు 2021 జూలై 13న సోషల్ మీడియాలో బ్రౌజ్ చేస్తుండగా.. ఫోన్‌పే లోగో, ఫాంట్‌తో కూడిన ఒక 'అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్' స్క్రాచ్ కార్డ్ కనిపించింది. సాధారణంగా గూగుల్ పే, ఫోన్‌పే వాడే ఆ వ్యక్తికి ఇలాంటి స్క్రాచ్ కార్డ్‌లు రావడం అలవాటే. దీంతో ఎలాంటి అనుమానం రాకపోవటంతో ఆ కార్డును 2 సార్లు స్క్రాచ్ చేశాడు. క్షణాల వ్యవధిలోనే అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ.4వేల 885, రూ. 4వేల969 చొప్పున మొత్తం రూ.9వేల 854 డెబిట్ అయ్యాయి. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే అప్రమత్తమై బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదును పరిశీలించిన బ్యాంకు మొదట్లో అది మోసమని గ్రహించి, బాధితుడు కోల్పోయిన మొత్తాన్ని జూలై 15, 2021న అతని ఖాతాలో తిరిగి జమ చేసింది. అయితే ఆగస్టు 4, 2021న బ్యాంకు ఆ క్రెడిట్‌ను వెనక్కి తీసుకుని అకౌంట్లో నుంచి డబ్బు కట్ చేసింది. UPI పిన్ నంబర్, పేమెంట్ అడ్రస్ కస్టమర్ కి మాత్రమే తెలుస్తాయని, ఇవి షేర్ చేయకుండా లావాదేవీ జరగదని బ్యాంక్ బదులిచ్చింది. కస్టమర్ ప్రమేయంతోనే లేదా నిర్లక్ష్యం వల్లే ఈ లావాదేవీలు జరిగాయని బ్యాంక్ ఆరోపించింది. దీంతో బాధితుడు కేరళ కన్స్యూమర్ కమిషన్‌ను ఆశ్రయించాడు.

కోర్టు తీర్పు..
కేసును విచారించిన ప్రెసిడెంట్ పి.వి. జయరాజన్, సభ్యులు ప్రీతా జి. నాయర్, విజు వి.ఆర్ కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. కేవలం "ఊహాజనిత నిర్లక్ష్యం" ఆపాదించి కస్టమర్‌పై భారం మోపలేరని స్పష్టం చేసింది. కస్టమర్ తప్పు చేసినట్లు లేదా కావాలని మోసంలో భాగస్వామిగా ఉన్నట్లు బ్యాంకు ఎలాంటి బలమైన ఆధారాలను చూపలేకపోయిందని కోర్టు తప్పుబట్టింది.

ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకు బాధ్యత వహించాలని ఆదేశిస్తూ.. బాధితుడు కోల్పోయిన రూ. 9వేల 854 మొత్తాన్ని తిరిగి జమ చేయాలని బ్యాంకును ఆదేశించింది. అలాగే నష్టపరిహారంగా రూ.5వేలు చెల్లించాలని పేర్కొంది. ఇక కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 3వేలు అందజేయమంది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని కేరళ కన్స్యూమర్ కమిషన్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా డిజిటల్ మోసాల బాధితులకు బ్యాంకులే పూర్తి బాధ్యత వహించాలనే స్పష్టమైన సందేశం పంపింది కోర్టు.