కేరళను.. కేరళంగా మార్చాలని కేంద్రానికి వినతి

కేరళను.. కేరళంగా మార్చాలని కేంద్రానికి వినతి
  • రాష్ట్రం పేరు మార్చాలంటూ 
  • కేరళ సర్కార్ తీర్మానం 

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం.. తమ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని బుధవారం అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ రాష్ట్రం పేరు మలయాళం భాషలో ‘కేరళం’ అని పేర్కొన్నారు. ‘‘మన దేశంలో 1956 నవంబర్ 1న భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. 

అదే రోజు కేరళ ఏర్పడింది. అయితే మలయాళంలో ‘కేరళం’ అంటారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ లో మా రాష్ట్రాన్ని కేరళగా పేర్కొన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం దాన్ని ‘కేరళం’గా మార్చాలి. అలాగే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్​లో పేర్కొన్న అన్ని భాషల్లోనూ మా రాష్ట్రం పేరును ‘కేరళం’గా సవరించాలి” అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నా రు. కాగా, రాష్ట్రాల పేరు మార్చాలంటే పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి.