రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ సర్కారు పిటిషన్

రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ సర్కారు పిటిషన్
  • బిల్లులకు ఆమోదం తెలపకుండా జాప్యం చేయడంపై అసంతృప్తి​

న్యూఢిల్లీ: అసెంబ్లీలో ఆమోదించిన నాలుగు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపకుండా పక్కనపెట్టడంపై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తన వద్ద ఏడు బిల్లులు పెండింగ్‌‌లో పెట్టుకున్నారని, అందులో 4 బిల్లులను దాదాపు రెండేండ్ల తర్వాత రాష్ట్రపతి పరిశీలనకు పంపగా.. అక్కడ కూడా పెండింగ్‌‌లో ఉండిపోయాయని పిటిషన్‌‌లో కేరళ సర్కార్ వివరించింది.

యూనివర్సిటీ లాస్ (ఎమెండమెంట్) (నెంబర్ 2) బిల్లు-2021, కేరళ కో-ఆపరేటివ్ సొసైటీస్ (అమెండమెంట్) బిల్లు 2022, యూనివర్సిటీ లాస్ (అమెండమెంట్) బిల్లు-2022, యూనివర్సిటీ లాస్ (అమెండమెంట్) (నెంబర్ 3) బిల్లు-2022 పెండింగ్‌‌లో ఉన్నాయని, ఎలాంటి కారణం చెప్పకుండానే వాటిని పక్కన పెట్టేశారని పినరయి సర్కార్ ఆ పిటిషన్‌‌లో పేర్కొంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెక్రటరీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఆయన అదనపు కార్యదర్శి పేర్లను సీపీఎం సారథ్యంలోని ఎల్‌‌డీఎఫ్ ప్రభుత్వం చేర్చింది.

ఇలా అసాధారణ జాప్యం చోటుచేసుకోవడం చట్టం ముందు అందరూ సమానమనే రాజ్యాంగంలోని సెక్షన్ 14 ఉల్లంఘించడమేనని పేర్కొంది. రాజ్యాంగంలోని 22 సెక్షన్ ప్రకారం కేరళ రాష్ట్ర ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందకుండా చేసినట్టు అవుతుందని వెల్లడించింది. గతంలోనూ ఇదే అంశంపై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను గవర్నర్​ పెండింగ్​ ఉంచేస్తున్నారంటూ పిటిషన్​వేసింది. దీనిపై సుప్రీంకోర్టు గవర్నర్​పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పుడు నోటీసులు కూడా జారీ చేసింది.​