కేరళలో భారీ వర్షాలు.. రాబోయే 5 రోజులు వానలే వానలంట..!

 కేరళలో భారీ వర్షాలు.. రాబోయే 5 రోజులు వానలే వానలంట..!

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికించబోతున్నాయి.రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ  క్రమంలో  పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది.

పరిస్థితి తీవ్రతను బట్టి కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) కీలక భద్రతా సూచనలు జారీ చేసింది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, నేల కోతకు గురయ్యే ప్రాంతాలు , వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తక్షణమే అప్రమత్తం కావాలి. అధికారులు సూచించిన విధంగా సురక్షిత ప్రాంతాలకు లేదా సహాయక శిబిరాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం కోరుతోంది.

ముఖ్యంగా నదులు, జలాశయాల వద్దకు ఎవరూ వెళ్లరాదని అధికారులు స్పష్టం చేశారు. నీటి ప్రవాహంలో స్నానాలు చేయడం, చేపలు పట్టడం వంటి సాహసాలు చేయవద్దు. వంతెనలపై నిలబడి సెల్ఫీలు తీసుకోవడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు. వాతావరణం కుదుటపడే వరకు కొండ ప్రాంతాలకు, జలపాతాలకు,తీర ప్రాంతాలకు అనవసర ప్రయాణాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.

భారీ గాలుల ప్రభావంతో బలహీనమైన కట్టడాలు కూలిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి ప్రజలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. సహాయం కోసం అన్ని జిల్లాల్లో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 1077 లేదా 1070 టోల్-ఫ్రీ నంబర్లను సంప్రదించి అధికారుల సాయం పొందవచ్చు.

ALSO READ : బిడ్డను అమ్మేసి మరో పెళ్లి చేసుకున్న భార్య..

ఆరెంజ్ అలర్ట్ 

ఇడుక్కి ,మలప్పురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఎల్లో అలర్ట్..

  • మే 15న కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కాడ్, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్ ,కాసరగోడ్.
  • మే 16న తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం.
  • మే 17న అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసరగోడ్.