కేరళ యువతిని విడిచిపెట్టిన ఇరాన్

కేరళ యువతిని విడిచిపెట్టిన ఇరాన్
  • మిగతా 16 మంది ఇండియన్ల విడుదలకూ ఓకే 

న్యూఢిల్లీ: ఇరాన్ ఇటీవల స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కార్గో షిప్పు సిబ్బందిలోని కేరళ యువతి సురక్షితంగా ఇంటికి చేరుకున్నట్లు మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ ధీర్ జైస్వాల్ గురువారం వెల్లడించారు. టెహ్రాన్‌‌లోని భారత ఎంబసీ, ఇరాన్ ప్రభుత్వ చొరవతో  షిప్ సిబ్బందిలోని ఇండియన్ డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్.. కొచ్చిన్ ఎయిర్ పోర్టులో దిగారని తెలిపారు. ఈ నెల 13న హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ వాణిజ్య నౌక ఎంఎస్సీ ఏరిస్ ను ఇరాన్ కు చెందిన ఐఆర్డీసీ దళం సీజ్ చేసింది. షిప్ లో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. అందులో 17 మంది భారతీయులే ఉన్నారు. 

దాంతో ఇరాన్ నుంచి వారిని విడిపించేందుకు మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ రంగంలోకి దిగారు. ఆదివారం ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాతో మాట్లాడారు. జైశంకర్  అభ్యర్థన మేరకు మన సిబ్బందిని టెహ్రాన్ లోని భారత రాయబార కార్యాలయం అధికారులు కలిసేందుకు ఇరాన్ అనుమతించింది. చర్చల తర్వాత  సిబ్బందిలో ఒకరైన  కేరళలోని త్రిసూర్‌‌కు చెందిన డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ ను ఇరాన్ విడిచిపెట్టింది.

 మిగతా 16 మంది సురక్షితంగానే ఉన్నారని.. భారత్ లోని కుటుంబసభ్యులతో టచ్ లోనే ఉన్నారని రణ్ ధీర్ జైస్వాల్ వెల్లడించారు. వారిని కూడా ఇరాన్ నుంచి ఇండియా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా.. కార్గో షిప్ లోని భారతీయ సిబ్బంది ఎప్పుడైనా  తిరిగి స్వదేశానికి రావచ్చని ఇండియాలోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి ప్రకటించారు. వారిని ఇరాన్ నిర్బంధించలేదని.. షిప్ కెప్టెన్ అనుమతిస్తే వారిని ఇండియాకు పంపడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు.