- బీర్బల్, శేషులు పాక్‌కు సంబంధించిన సోషల్ మీడియా ఫాలో అవుతున్నట్లు గుర్తింపు
- డిస్మిస్‌తో సూడాన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశం కోల్పోయిన మల్లేశ్
- శేషులు, వినోద్, ప్రవీణ్ సహకారంతో ఆయుధాల చోరీ
- కోల్‌కతాకు చెందిన ఇద్దరు సహా ఏడుగురు అరెస్ట్
- టెర్రరిస్ట్ లింకులు లేవు : సీపీ సుమతి
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో మరో కీలక విషయం బయటపడింది. కోల్‌కతాకు చెందిన ఆయుధాల స్మగ్లర్ బీర్బల్ షాకు పాకిస్తాన్‌కు సంబంధించిన సోషల్ మీడియా లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెజిమెంట్ సిపాయి కొండూరి శేషులు కూడా పాక్‌కు సంబంధించిన సోషల్ మీడియా కంటెంట్ చూస్తున్నట్లు తేలడంతో వారి ఆన్‌లైన్ లింకులపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆయుధాల చోరీ వెనుక ఎలాంటి టెర్రరిస్ట్ సంబంధాలు లేవని మేడ్చల్ మల్కాజిగిరి సీపీ సుమతి స్పష్టం చేశారు. ఆయుధాలను విక్రయించి డబ్బు చేసుకునేందుకే మల్లేశ్ ఈ పని చేసినట్లు చెప్పారు. కేసులో కోల్‌కతాకు చెందిన అవిదే అలియాస్ ఓబీ, బీర్బల్ షాతో పాటు మల్లేశ్ స్నేహితులు మల్లికార్జున్, నిరంజన్, ఆర్మీ సిబ్బంది శేషులు, వినోద్‌కుమార్, ప్రవీణ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
డిస్మిస్‌తో సూడాన్ అవకాశం పోయింది
మల్లేశ్‌పై అచ్చంపేట, అమ్రాబాద్ పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2010లో ఆర్మీలో హవల్దార్‌గా చేరిన అతడు గతంలో పలుమార్లు సస్పెన్షన్‌కు గురయ్యాడని చెప్పారు. 2022లో బరాక్‌పూర్‌లో పనిచేస్తున్న సమయంలో బీర్బల్ ద్వారా అవిదే వద్ద రూ.10 వేలకు తపంచా, లైవ్ బుల్లెట్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. స్థానికులను బెదిరించి డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశంతో దాన్ని అచ్చంపేటలోని తండ్రి ఇంట్లో దాచినట్లు తెలిపారు. గతేడాది బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌కు బదిలీ అయిన మల్లేశ్‌ను విధుల్లో నిర్లక్ష్యం కారణంగా జూన్‌లో డిస్మిస్ చేసినట్లు సీపీ చెప్పారు.
సూడాన్‌లో ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు
మరో మూడేండ్లు సర్వీస్ పూర్తి చేసి ఉంటే సూడాన్ ఆర్మీలో ఉద్యోగం దక్కేదని, సుమారు రూ.40 లక్షల జీతంతో ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చుకోవచ్చని మల్లేశ్ భావించినట్లు పోలీసులు తెలిపారు. అయితే డిస్మిస్ కావడంతో ఆ అవకాశం కోల్పోయాడని చెప్పారు. దీంతో మద్రాస్ రెజిమెంట్‌లోని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చోరీ చేసి విక్రయించాలని ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.
ఆరుసార్లు రెక్కీ.. ‘కామ్ హోగయా’ మెసేజ్
చోరీ కోసం శేషులు, వినోద్‌కుమార్, ప్రవీణ్‌లను మల్లేశ్ ఒప్పించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కోల్‌కతా వెళ్లి బీర్బల్, అవిదేలను కలవగా.. ఒక్కో పిస్టల్‌కు రూ.3 లక్షలు, ఏకే-47, ఇన్సాస్ వంటి ఆయుధాలకు రూ.5 లక్షల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. ఆగస్టు 31న చోరీకి ముందు ముగ్గురు ఆర్మీ సిబ్బందితో కలిసి మల్లేశ్ ఆరుసార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. చోరీ రోజు పిస్టల్ పోయిందని వినోద్ ముందుగానే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాడన్నారు. ఆయుధాలను ఆర్మరీ నుంచి తరలించిన తర్వాత నిందితులు ‘కామ్ హోగయా’ అంటూ మెసేజ్ చేసుకుని వాట్సప్ కాల్స్‌లో మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. అనంతరం చోరీ చేసిన ఆయుధాలను మల్లేశ్ తన బ్రీజా కారులో నాగర్‌కర్నూల్‌కు తరలించినట్లు సీపీ సుమతి తెలిపారు.
