- టీవీకే అభ్యర్థిపై స్టాలిన్ బాడీ షేమింగ్..
- తీవ్రంగా ఖండించిన సీఎం విజయ్
- మాజీ సీఎంపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీవీకే
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్.. టీవీకే మహిళా అభ్యర్థిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీచేస్తున్న సత్యభామను ఉద్దేశిస్తూ.. ‘ఆమె సత్యభామ కాదు.. సూట్‌కేస్ భామ’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నాడీఎంకే పార్టీ నుంచి పోటీచేసిన సత్యభామ విజయం సాధించారు.
కొన్నిరోజుల తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేసి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాగా.. ఆమె టీవీకే తరఫున బరిలో నిలిచారు. కాగా, ధారాపురం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం స్టాలిన్ ఓ సభలో మాట్లాడుతూ.. సత్యభామ పార్టీ మారడంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె డబ్బు కోసమే పార్టీ మారారని.. సత్యాన్ని పాటించని ఆమె.. ‘సత్యభామ కాదు.. సూట్‌కేస్ -భామ’, ‘పల్టీ-భామ' అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఆమె శరీరాకృతిని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
డీఎంకే ఓ దుష్టశక్తి: సీఎం విజయ్
స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. స్టాలిన్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం, జుగుప్సాకరమని మండిపడ్డారు. డీఎంకే ఓ రాజకీయ పార్టీ కాదని, అది ఒక దుష్టశక్తి అని ఆయన విమర్శించారు. ధారాపురం ఎన్నికల ప్రచార సభను స్టాలిన్ అసహ్యకరమైన వేదికగా మార్చేశారని విజయ్ ఆరోపించారు. సత్యభామపై స్టాలిన్ బాడీ షేమింగ్ అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.
తాను కేవలం పార్టీ అధినేతగా మాత్రమే కాకుండా, తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఒక కొడుకులా, పెద్ద అన్నలా, తమ్ముడిలా నిలబడి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని విజయ్ పేర్కొన్నారు. కాగా, సత్యభామపై స్టాలిన్చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీవీకే పార్టీకి చెందిన న్యాయ విభాగం నేతలు భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మహిళలపై వేధింపుల నిరోధక చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం స్టాలిన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
