- రాష్ట్రపతి ముర్ము ఆమోదంతో గెజిట్ రిలీజ్
- త్వరలోనే ఖరారుకానున్న విధివిధానాలు!
గాంధీనగర్: గుజరాత్ ప్రభుత్వం పంపించిన యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో దేశంలో ఉత్తరాఖండ్ తర్వాత యూసీసీ చట్టాన్ని అమలు చేయడానికి అనుమతి పొందిన రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. యూసీసీకి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో గుజరాత్ ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది.
రాష్ట్రంలో ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై త్వరలోనే విధివిధానాలను (రూల్స్) ప్రకటించనున్నారు. ఈ ఏడాది మార్చిలో గుజరాత్ అసెంబ్లీ సుదీర్ఘ చర్చల తర్వాత యూసీసీ బిల్లును ఆమోదించింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని మతాల వారికీ పెళ్లి, విడాకులు, ఆస్తుల పంపకం (వారసత్వం), సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్షిప్స్) వంటి విషయాలన్నింటిలోనూ ఒకే రకమైన చట్టం వర్తిస్తుంది.
సమాజంలోని అందరికీ, ముఖ్యంగా మహిళలకు సమాన హక్కులు కల్పించడమే యూసీసీ చట్టం ముఖ్య ఉద్దేశమని సీఎం భూపేంద్ర పటేల్ స్పష్టం చేశారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.
రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత
యూసీసీ చట్టంపై రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది కేవలం ఎన్నికల లబ్ధి కోసమే తెచ్చిన చట్టమని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఆరోపించాయి. మతపరమైన హక్కులకు ఇది విరుద్ధమని కొందరు ముస్లిం నేతలు వాదిస్తుండగా.. గిరిజన మహిళల హక్కులు, వారి చట్టాల గురించి ఇంకా స్పష్టత రావాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్రపతి ఆమోదం లభించడంతో గుజరాత్లో యూసీసీ అమలు దిశగా కీలక అడుగు పడినట్లయింది.
