తెలంగాణలో అధిక మద్యం వినియోగం ఆందోళనకరం : పద్మనాభ రెడ్డి 

తెలంగాణలో అధిక మద్యం వినియోగం ఆందోళనకరం : పద్మనాభ రెడ్డి 
  • ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి 

హైదరాబాద్, వెలుగు: దేశంలోనే అత్యధికంగా మద్యం వినియోగం జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుండడం ఆందోళనకరమని 'ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్' సెక్రటరీ పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఆయన శనివారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. ఈ అధిక మద్యం వినియోగం ప్రజారోగ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, మహిళలపై నేరాలకు దారితీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత పురుషుల్లో 46.6 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 36.3 శాతం మంది మద్యం తాగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. రెండు దశాబ్దాల క్రితం గ్రామాల్లో మద్యం లభ్యత పరిమితంగా ఉండేదని, కానీ కొన్నేళ్లుగా బెల్ట్ షాపుల విస్తరణతో ఇంటి గడప వద్దే మద్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల్లో పేదలు సింహభాగాన్ని మద్యం కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు.