పీసీసీ చీఫ్ ఎవరో తేల్చేస్తారా? ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం

పీసీసీ చీఫ్ ఎవరో తేల్చేస్తారా? ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం
  •  హాజరైన సోనియా, రాహుల్,ఖర్గే
  •  రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ  సీఎం భట్టి, ఇన్ చార్జి దీపాదాస్ మున్షి
  •  ఆరు మంత్రి పదవులపైనా చర్చ
  •  అందరి చూపు హస్తిన వైపు

హైదరాబాద్/ ఢిల్లీ: తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరో తేల్చేందుకు రంగం  సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ కీలక  నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతో నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. 

పీసీసీ చీఫ్​ గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి కోసం పలువురు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తో పాటు మాజీ ఎంపీ మధుయాష్కి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఆ తర్వాత ఐదు పేర్లు తెరమీదకు వచ్చాయి. 

అందులో మహేశ్ కుమార్ గౌడ్, బల్ రాంనాయక్, అడ్లూరి లక్షణ్​ కుమార్, సంపత్ కుమార్, మధుయాష్కీ పేర్లు గట్టిగానే వినిపించాయి. ప్రాంతాల వారీగా చూసినా సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణకు చెందిన వారు. పీసీసీ చీఫ్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తే ఈ ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా పరిశీలించే అవకాశం ఉంది. వారిలో బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్(నిజామాబాద్‌), బలరాం నాయక్(ఉమ్మడి వరంగల్), అడ్లూరి లక్ష్మణ్​ కుమార్ (ఉమ్మడి కరీంనగర్) ముందున్నారని తెలుస్తోంది. సామాజిక వర్గాల ప్రాతిపదికన ఇప్పుడు చర్చ జరుగుతున్నట్టు సమాచారం. వీరిలో బీసీలకు ఇవ్వాలని భావిస్తే మహేశ్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్​ పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

ఎన్ ఎస్ యూఐ లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మహేశ్ కుమార్ గౌడ్ పార్టీకి విధేయుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తున్నారనే చర్చ ఉంది. దీంతో  ఎస్టీకి ఇవ్వాలని భావిస్తే మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. లంబాడా సామాజిక వర్గానికి చెందిన  సీనియర్ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న బలరాం నాయక్ కు ఇవ్వడం ద్వారా తాము గిరిజనుల పక్షమనే సంకేతాలు ఇవ్వాలని భావిస్తే ఆయనకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ALSO READ | ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి...

మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఏఐసీసీ అనుకుంటే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదే సామాజికవర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా ఉన్నారు. దీంతో మాదిగలకు చాన్స్ ఇస్తారనే ప్రచారం బలంగానే వినిపిస్తోంది. అదే  జరిగితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి  చెందిన మాదిగ సామాజిక వర్గం నేత కావడం కలిసివచ్చే అంశమనే విశ్లేషణలూ ఉన్నాయి. ఏది ఏమైనా ఏఐసీసీ ఈ దఫా తెలంగాణ పీసీసీ చీఫ్ ను తేల్చేస్తుందని సమాచారం. 

ఆరుగురు మంత్రులకు  చోటు

ప్రస్తుతం మంత్రి వర్గంలో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరినీ నియమించలేదు. ప్రధానంగా రేసులో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు, శ్రీహరి ముదిరాజ్, మల్ రెడ్డి రంగారెడ్డిలకు మంత్రిపదవి లభిస్తుందనే చర్చ జోరుగానే వినిపిస్తోంది. ఇదిలా ఉండగా మైనార్టీల నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తారనే చర్చ కూడా ఉంది. వీరిలో ఎవరికి మంత్రి పదవి లభిస్తుందనేది అధిష్టానం పరిధిలో ఉంది. ఏఐసీసీ కీలక సమావేశంలో మంత్రిపదవుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.