కేజీబీవీలకు మంచి రోజులు..రూ.241 కోట్ల నాబార్డు నిధులతో సౌలతులు

కేజీబీవీలకు మంచి రోజులు..రూ.241 కోట్ల నాబార్డు నిధులతో సౌలతులు
  • స్కూళ్లలో రూ.241 కోట్ల నాబార్డు నిధులతో సౌలతులు
  • కొత్తగా ఈ ఏడాది 120 కాలేజీలుగా అప్​గ్రేడ్ 
  • 93 కేజీబీవీలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​గా మార్పు 
  • తాజాగా అన్ని స్కూళ్లకూ డబుల్ బెడ్లు 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) మరిన్ని కొత్త సొబగులు సంతరించుకోనున్నాయి. అమ్మాయిలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు మెరుగైన వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు నిధులతో కేజీబీవీ రూపురేఖలను మార్చబోతున్నది. ఈ ఏడాదిలోనే ఆయా స్కూళ్లలో కార్పొరేట్  స్థాయి సౌకర్యాలు కల్పించనున్నది. రాష్ట్రంలో 495 కేజీబీవీలు ఉండగా, వాటిలో 1.43 లక్షల మంది చదువుతున్నారు. తొలుత ఈ విద్యాలయాలు పదో తరగతి వరకే ఉండేవి. ప్రస్తుతం దశలవారీగా వాటిని ఇంటర్మీడియెట్​ స్థాయికి అప్​గ్రేడ్  చేస్తున్నారు. ఈ ఏడాదే కొత్తగా 120 కేజీబీవీలు కాలేజీలుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీలపై ప్రత్యేక దృష్టి సారించడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి 17వేల అడ్మిషన్లు పెరిగాయి. వచ్చే ఏడాది మిగిలిన అన్ని స్కూళ్లనూ ఇంటర్మీడియెట్​ స్థాయికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

నాబార్డ్  నిధులతో వసతులు

అప్​గ్రేడ్  అయిన కేజీబీవీలతో పాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మిగిలిన స్కూళ్లలో వసతులు కల్పించనున్నారు. దీని కోసం నాబార్డు నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో విద్యార్థినుల భద్రత, పరిశుభ్రత, వసతులకు ప్రయారిటీ ఇచ్చింది. ఇప్పటికే టీజీ ఈడబ్ల్యూఐడీసీ పర్యవేక్షణలలో రూ.243.16 కోట్లతో ప్రణాళికలు రూపొందించి, పనులు మొదలుపెట్టారు. విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా కేజీబీవీల్లో మొత్తం 8,009 అదనపు బాత్‌‌‌‌రూమ్‌‌‌‌  కమ్  టాయిలెట్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పాటు కొత్తగా అప్​గ్రేడ్  అయిన కేజీబీవీల్లో తరగతి గదుల కొరతను తీర్చేందుకు 341 అదనపు క్లాస్‌‌‌‌రూమ్‌‌‌‌లు కట్టనున్నారు. వీటితో పాటు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం 149 స్కూళ్లకు వాటర్  సంపులను, విద్యాలయాల భద్రత కోసం 93 కేజీబీవీలకు కాంపౌండ్  గోడలను నిర్మించనున్నారు.

అన్నింటిలో స్కౌట్స్ అండ్  గైడ్స్

విద్యార్థినుల్లో సామాజిక సేవ, లీడర్ షిప్  క్వాలిటీస్ పెంపొందించేందుకు ఈ ఏడాది అన్ని కేజీబీవీల్లో స్కౌట్స్ అండ్  గైడ్స్  యూనిట్లను ప్రారంభించనున్నారు. దీన్ని ఒక ప్రత్యేక కరికులంగా బోధిస్తారు. దీంట్లో భాగంగా స్టూడెంట్లు క్యాంపులు, సాహసక్రీడలు, కమ్యూనిటీ సర్వీస్  ప్రాజెక్టుల్లో పాల్గొంటారు. మరోపక్క కేజీబీవీల్లోని విద్యార్థినులు నేలపైనే పడుకుంటున్నారు. త్వరలోనే వారికి డబుల్ బెడ్లను సరఫరా చేయాలని సర్కారు నిర్ణయించింది.

క్వాలిటీ ఎడ్యుకేషన్​తో పాటు ఫెసిలిటీస్ : డాక్టర్  నవీన్  నికోలస్, స్కూల్ ఎడ్యుకేషన్  డైరెక్టర్​ 
కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు మరిన్ని ఫెసిలిటీస్ కల్పించనున్నాం. ఈ ఏడాది రూ.243 కోట్లతో నాబార్డు నిధులతో బాత్ రూమ్ కమ్ టాయ్ లెట్లు, కాంపౌండ్ వాల్స్, వాటర్ సంప్​లను నిర్మిస్తున్నాం. ఇప్పటికే 180 కేజీబీవీల్లో సివిల్ వర్క్స్ నడుస్తున్నాయి. కేజీబీవీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చర్యలు తీసుకుంటున్నది. 

జేఈఈ, నీట్ స్పెషల్  కోచింగ్ 

కేజీబీవీల్లో చదివే విద్యార్థినులను వివిధ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం చేసేలా స్కూల్ ఎడ్యుకేషన్  డైరెక్టరేట్, విద్యా శాఖ చర్యలు చేపట్టాయి. ఈ ఏడాది 93 కేజీబీవీలను యంగ్  ఇండియా సెంటర్ ఆఫ్  ఎక్సలెన్స్​గా మార్చారు. వాటిలో రెగ్యులర్  క్లాసులతో పాటు జేఈఈ, నీట్, క్లాట్  తదితర ఎంట్రెన్స్  ఎగ్జామ్స్  కోసం స్పెషల్  ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు కేజీబీవీల్లో ఈ క్లాసులు మొదలయ్యాయి. వాటిలో డిజిటల్  క్లాస్ రూములు, అధునాతన ల్యాబ్ లు, విశాలమైన లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నారు.