
న్యూఢిల్లీ: లండన్లోని ఇండియన్ హై కమిషన్ ఆఫీసుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పంజాబ్లో ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం సెర్చ్ కొనసాగుతుండటం, అతని మద్దతుదారులను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో లండన్లో పలువురు ఖలిస్తాన్ మద్దతుదారులైన సిక్కులు నిరసనలు తెలిపారు. ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ వద్దకు చేరుకుని, బిల్డింగ్పై ఉన్న త్రివర్ణ పతాకాన్ని తొలగించారు.
ఈ ఘటనపై ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎలిస్కు మన విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. హై కమిషన్ వద్ద సెక్యూరిటీ కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిపై అలెక్స్ ఎలిస్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఇండియన్ హై కమిషన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వాటిని తాము ఆమోదించబోమని ట్వీట్ చేశారు.