కెనడాలో మరో ఖలిస్తానీ టెర్రరిస్ట్ హత్య 

కెనడాలో మరో ఖలిస్తానీ టెర్రరిస్ట్ హత్య 
  •      గ్యాంగ్ వార్ లో సుఖ్ దూల్ సింగ్ మృతి
  •     2017లో కెనడాకు  పరారైన గ్యాంగ్ స్టర్   
  •     ఖలిస్తానీ ఉద్యమంలో కీలక పాత్ర 
  •     కెనడాలో ఉంటూనే పంజాబ్ లో నేరాలు 

చండీగఢ్/న్యూఢిల్లీ : కెనడాలో మరో ఖలిస్తానీ టెర్రరిస్ట్ హత్యకు గురయ్యాడు. విన్నిపెగ్ సిటీలో బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్ వార్ లో సుఖ్ దూల్ సింగ్ అలియాస్ సుఖా దునెకె మరణించాడని నిఘా వర్గాలు గురువారం తెలిపాయి. ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో అతడు మరణించి ఉంటాడని పేర్కొన్నాయి. అయితే సుఖ్ దూల్ సింగ్ ను తామే చంపామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.

‘‘గ్యాంగ్ స్టర్లు గురులాల్ బ్రార్, విక్కీ మిద్దుఖేరా మర్డర్లలో దునెకె ప్రముఖ పాత్ర పోషించాడు. అతడో డ్రగ్ అడిక్ట్. అతను చేసిన పాపాలకు శిక్ష పొందాడు. మా శత్రువులు దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా విడిచిపెట్టం” అని ఫేస్ బుక్ లో బిష్ణోయ్ గ్యాంగ్ పోస్టు పెట్టింది. బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. కాగా, కెనడాలో ఇప్పటికే ఖలిస్తానీ టెర్రరిస్ట్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురికాగా..

ఈ విషయంలో కెనడా, భారత్ మధ్య వివాదం నెలకొంది. రెండు దేశాల మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మరో ఖలిస్తానీ టెర్రరిస్ట్ హత్యకు గురికావడం గమనార్హం. 

ఎవరీ సుఖ్ దూల్ సింగ్? 

సుఖ్ దూల్ సింగ్.. పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్టర్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అతడి సొంతూరు మోగా జిల్లాలోని దునెకె కలాన్. సుఖ్ దూల్ సింగ్ 2017లో ఫేక్ పాస్ పోర్టుతో కెనడాకు పారిపోయాడు. అక్కడ ఖలిస్తానీ ఉద్యమంలో యాక్టివ్ గా పని చేశాడు. ఖలిస్తానీ టెర్రరిస్ట్ అర్షదీప్ డల్లా, గ్యాంగ్ స్టర్స్ లక్కీ పటియాల్, జాక్ పాల్ సింగ్ అలియాస్ లాలీ, ఇతర క్రిమినల్స్ తో కలిసి పని చేశాడు. సుఖ్ దూల్ సింగ్ కెనడాలో ఉంటూనే పంజాబ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తన గ్యాంగ్ తో దోపిడీలు, మర్డర్లు చేయించాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఇతని గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోయాయని తెలిపాయి.

సుఖ్ దూల్ సింగ్ అనుచరులు కుల్విందర్ సింగ్ అలియాస్ కిండా, పరంజిత్ సింగ్ పమ్మను జనవరిలో అరెస్టు చేసినట్టు వెల్లడించాయి. ‘‘1990లో తన తండ్రి చనిపోగా మోగా డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో ప్యూన్ గా సుఖ్ దూల్ సింగ్ కు జాబ్ వచ్చింది. దాదాపు 8 ఏండ్లు జాబ్ చేసిన అతడు.. ఆ తర్వాత డ్రగ్స్ కు బానిస అయ్యాడు. దావిందర్ బాంబిహా గ్యాంగ్ లో చేరాడు. 2017లో కెనడాకు పారిపోగా, 2022లో అతనిపై లుక్ అవుట్ నోటీస్ జారీ చేశాం” అని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

పోయినేడాది జనవరిలో గ్యాంగ్ స్టర్లు మన్ ప్రీత్ సింగ్, విక్కీ సింగ్ హత్యలతో పాటు అదే ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ సందీప్ నంగల్ అంబియాన్ హత్యలోనూ సుఖ్ దూల్ సింగ్ పాత్ర ఉందని తెలిపాయి. 

హిందువులను బెదిరిస్తున్నరు: చంద్ర ఆర్య

ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలంటూ కెనడాలోని హిందువులను ఖలిస్తానీ లీడర్లు బెదిరిస్తున్నారని అక్కడి అధికార పార్టీ ఎంపీ, ఇండో–కెనడియన్ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కొద్ది రోజుల కింద సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ ప్రెసిడెంట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ.. దేశం విడిచి పోవాలని కెనడాలోని హిందువులను బెదిరించారు. ఇటువంటి బెదిరింపులు తమకూ వచ్చాయని చాలామంది హిందువులు నాకు చెప్పారు” అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. హిందువులందరూ సంయమనంతో, అలర్ట్ గా ఉండాలని విజ్ఞప్తి చేశారు.