మమ్మల్ని తక్కువ అంచనా వేసినవ్.. అసలు సినిమా ముందుంది: ట్రంప్‎కు ఇరాన్ వార్నింగ్

మమ్మల్ని తక్కువ అంచనా వేసినవ్.. అసలు సినిమా ముందుంది: ట్రంప్‎కు ఇరాన్ వార్నింగ్

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‎కు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి టెహ్రాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారు. ఖమేనీని హత్య చేసి మిడిల్ ఈస్ట్‎లో ఉద్రిక్తతలు చెలరేగడానికి ట్రంపే కారణమని ఆరోపించారు. 

ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకునే వరకు ఇరాన్ నిద్రపోదని.. ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సామర్ధ్యాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేశారు.. ఖమేనీని హతం చేస్తే ఇరాన్ పనైపోతుందని ఆయన అనుకున్నారు. కానీ ఈ యుద్ధం అంత త్వరగా ముగియదన్నారు. ట్రంప్‎ను ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. యుద్ధంలో ఇప్పటి వరకు1,000 మందికి పైగా ఇరానియన్లు మరణించారని తెలిపారు. 

అతను ఎవరో నాకు తెలియదు: ట్రంప్ 

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని హెచ్చరికలపై ట్రంప్ రియాక్ట్ అయ్యారు. అసలు లారిజాని ఎవరో కూడా తనకు తెలియదని బెదిరింపులను కొట్టిపారేశారు. అతను ఏమి మాట్లాడుతున్నాడో కూడా అర్ధం కావడం లేదని.. తాను అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోనని చెప్పారు. ఇక, ఇరాన్‎పై అమెరికా దండయాత్ర కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ షరతులు లేకుండా లొంగిపోవాలని మరోసారి ట్రంప్ డిమాండ్ చేశారు.