- ప్లాట్లు ఇప్పిస్తామని నమ్మించి బురిడీ
- ఏసీపీకి బాధితుల ఫిర్యాదు
ఖమ్మం, వెలుగు: భూదాన్ భూములు, ప్రభుత్వ భూముల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన ఘటన ఖమ్మం అర్బన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బాధితులు గురువారం ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రమణమూర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌తో పాటు ఇతర స్టేషన్ల పరిధిలో కూడా ఇలాంటి మోసాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. పోలబోయిన ముత్తయ్య అనే వ్యక్తి భూదాన్ భూముల్లో ప్లాట్లు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. మొత్తం 38 మందిని మోసం చేసి సుమారు రూ.54.13 లక్షలు దోచుకున్నాడు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ముత్తయ్య ఇచ్చిన రశీదులను పోలీసులు పరిశీలించగా అవి ‘భూదాన్ వినోభాభావే వెల్ఫేర్ సొసైటీ’, యూసీసీఆర్ఐ(ఎంఎల్) పార్టీ, పి.అరవింద్ పేర్లతో ముద్రించిన నకిలీ రశీదులుగా తేలాయి. ఈ రశీదులను ఉపయోగించి ప్రజలను మోసం చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే భూదాన్ కేసుల్లో నిందితుడైన పోలబోయిన ముత్తయ్యను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. లోతైన విచారణ కోసం అతన్ని పోలీస్ కస్టడీకి కోరినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు.
