- నిమ్స్ లో బాధితురాలిని పరామర్శించిన మంత్రి సీతక్క
- నిందితులకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాలో అఘాయిత్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి కుటుంబానికి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందచేశారు. గురువారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన సీతక్క.. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ జస్టిస్ పంచాక్షరితో కలిసి బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్థిక సాయం చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. లైంగిక దాడికి గురైన బాలికకు నిమ్స్ వైద్యులు గురువారం శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రికి డాక్టర్లు వివరించారు. చిన్నారి పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని సీతక్క స్పష్టం చేశారు.
చదువు, పునరావాసానికి హామీ
బాలిక తోబుట్టువులందరికీ ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. బాలిక విద్య, భవిష్యత్తు పునరావాసంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు కఠిన శిక్ష పడేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
బాధిత కుటుంబానికి న్యాయపరంగా, ఆర్థికంగా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓఝా, ఆర్.జె.డి మోతి, నిమ్స్ వైద్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
