Aryan Karra: తెలంగాణ క్రీడా రంగానికి మరో అద్భుతమైన గౌరవం దక్కింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ వేదికగా జరగబోయే 15వ IHAI నేషనల్ ఐస్ హాకీ చాంపియన్‌షిప్ 2026లో బరిలోకి దిగే తెలంగాణ రాష్ట్ర జట్టుకు అంతర్జాతీయ ఇన్‌లైన్ హాకీ ప్లేయర్ ఆర్యన్ కర్రా సెలక్ట్ అయ్యాడు. ఈ మేరకు తెలంగాణ ఐస్ హాకీ అసోసియేషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
డెహ్రాడూన్ లో అసలు పోరు:
తెలంగాణ ఐస్ హాకీ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జాతీయ టోర్నీలో రాణించడం కోసం ఆర్యన్ కర్రా జూన్ 16 నుంచి జూన్ 30, 2026 వరకు జరిగే రాష్ట్ర జట్టు ప్రత్యేక సన్నాహక (ట్రైనింగ్) క్యాంప్‌లో పాల్గొంటాడు. ఆ తర్వాత జూలై 1 నుంచి జూలై 8వ తేదీ వరకు డెహ్రాడూన్‌లో జరగబోయే మెయిన్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు తరఫున ఐస్ హాకీ రింక్‌లో తలపడనున్నాడు. డిసిప్లిన్, కఠిన శ్రమతో ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్యన్ రాకతో తెలంగాణ జట్టు మరింత బలోపేతం కానుంది.
అంతర్జాతీయ వేదికలపై అదరగొట్టిన ఆర్యన్:
ఆర్యన్ కర్రాకు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం చాలా ఉంది. గతంలో ఇటలీలోని రోకారాసోలో జరిగిన వరల్డ్ ఇన్‌లైన్ హాకీ చాంపియన్‌షిప్ లో అతను భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు, 2018 ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు బ్రాంజ్ మెడల్ అందించి దేశ ఖ్యాతిని ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత సౌత్ కొరియాలో జరిగిన 18వ ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత జూనియర్ బాయ్స్ టీమ్ మెంబర్‌గా అలరించాడు.
►ALSO READ | ఇంగ్లాండ్ సిరీస్‌కు విరాట్ రెడీనా?.. కింగ్ కోహ్లీ కంబ్యాక్‌పై సస్పెన్స్!
జాతీయ టోర్నీల్లో హాట్రిక్ గోల్స్:
ఆర్యన్ కేవలం మంచి ప్లేయర్ మాత్రమే కాదు, అద్భుతమైన లీడర్ కూడా.. 61వ నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర ఇన్‌లైన్ హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ముందుండి నడిపించాడు. గతంలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లలో తెలంగాణ తరఫున మైండ్ బ్లోయింగ్ హాట్రిక్ గోల్స్ సాధించి రాష్ట్ర విజయాల్లో కీ-రోల్ ప్లే చేశాడు. ఆ పర్ఫార్మెన్సే అతనికి వరుసగా భారత జట్లలో చోటు దక్కేలా చేసింది.
అసోసియేషన్ ప్రశంస:
ఆర్యన్ కర్రా జాతీయ ఐస్ హాకీ జట్టుకు ఎంపికవ్వడం అనేది కేవలం అతని వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. తెలంగాణ క్రీడా రంగానికి దక్కిన గర్వకారణ క్షణం.. ఎన్నో ఏళ్ల కఠిన శ్రమ, త్యాగం, ఆటపై ఉన్న అంకితభావానికి దక్కిన ప్రతిఫలం ఇది అని క్రీడా ప్రతినిధులు కొనియాడారు.
