త్వరలోనే నామినేటెడ్ పోస్టులు.. సీఎంకు వెంటనే లిస్ట్ ఇవ్వండి: ఖర్గే

త్వరలోనే నామినేటెడ్ పోస్టులు.. సీఎంకు వెంటనే లిస్ట్ ఇవ్వండి: ఖర్గే
  • స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
  • గత బీఆర్ఎస్ సర్కార్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయండి 
  • పార్టీ నేతలు ఇష్టారీతిన మాట్లాడొద్దు 
  • కాంగ్రెస్ నేతలతో సమావేశంలో పార్టీ చీఫ్ దిశానిర్దేశం  
  • కులగణన తెలంగాణ సర్కార్ విజయం: సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేలా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. కష్టపడి పని చేస్తున్న నేతలకు వెంటనే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని.. ఇందుకోసం పేర్లతో కూడిన జాబితాను సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని పీసీసీ చీఫ్, ఇంచార్జీ మంత్రులను ఆదేశించారు. దీనిని పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ సమన్వయం చేసుకోవాలన్నారు. శుక్రవారం గాంధీ భవన్‎లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) మీటింగ్ తర్వాత పీసీసీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరైన ఖర్గే రాష్ట్ర నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. 

పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, జనం మధ్య తిరిగే వారికి, సత్తా ఉన్న క్యాడర్ కు వెంటనే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పదవులతో పాటు మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ పదవులు ఇవ్వాలని ఆదేశించారు. సీనియారిటీ, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని పదవులను భర్తీ చేయాలన్నారు. నామినేటెడ్ పదవులు పొందిన వారు లోకల్ బాడీ ఎన్నికల్లో మరింత జోష్ తో పని చేస్తారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి తీరాల్సిందేనని ఖర్గే స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.

పార్టీ నేతలు ఇష్టారీతిగా మాట్లాడొద్దు.. 

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీగా జనం కోసం కొట్లాడిన కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలని సీఎం రేవంత్ ను ఖర్గే ఆదేశించారు. అవసరమైతే దీనికోసం ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను ప్రభుత్వం బాగా అమలు చేస్తోందని ప్రశంసించారు. 

హామీలను అమలు చేస్తున్న ఏకైక పార్టీగా కాంగ్రెస్ దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలన చాలా బాగుందని, పార్టీ కార్యకర్తల పనితీరు కూడా భేష్ అని మెచ్చుకున్నారు. పార్టీ నేతలు ఎవరూ ఇష్టానుసారంగా మాట్లాడవద్దని, పార్టీ నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించారు. పార్టీ పరంగా చర్చించాల్సిన అంశాలు ఏమైనా ఉంటే పార్టీ వేదికలపైనే ప్రస్తావించాలని, బయట మాట్లాడితే వేటు తప్పదన్నారు.  

దేశంలోనే తెలంగాణ ఆదర్శం: సీఎం 

దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ పీఏసీ, పీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కేంద్రం మెడలు వంచి జన గణనలో కుల గణన చేసేలా తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. పార్టీ పదవులను ఈజీగా తీసుకోవద్దని, ఈ పదవులతోనే గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు.

 రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లతో ఘన విజయం సాధిస్తుందన్నారు. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్, రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పార్టీ నేతలు జానారెడ్డి, కేకే, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశానికి ముందు పాశ మైలారం ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన మృతులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

బీసీ, రవాణా శాఖల ప్రగతి నివేదిక విడుదల

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీ సంక్షేమం, రవాణా శాఖలో చేపట్టిన సంస్కరణలపై ప్రభుత్వం ప్రగతి నివేదిక సిద్ధం చేసింది. శుక్రవారం గాంధీ భవన్‎లో ఈ నివేదికను ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రిలీజ్ చేశారు. బీసీ కమిషన్, కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ఏర్పాటు, బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రెండు శాఖల్లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను నివేదికలో పొందుపరిచారు. అలాగే తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేసిన కులగణన అంశంపై ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక సమరభేరి సభలో స్క్రీన్ పై ప్రదర్శించారు.

కేసీ వేణుగోపాల్​తో రేవంత్, భట్టి భేటీ  

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణా హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో కుల గణన అమలు, ఎస్సీ వర్గీకరణ, రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో  బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చించారు. కేబినెట్ లో బెర్త్ లు దక్కని ఎమ్మెల్యేలు ఖర్గేతో భేటీ అయిన విషయం, వారికి రానున్న రోజుల్లో ఇవ్వాల్సిన ప్రాధాన్యత కూడా చర్చకు వచ్చింది. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు వ్యూహంపై కూడా వేణుగోపాల్ తో రాష్ట్ర నేతలు చర్చించారు.