న్యూఢిల్లీ: అజిత్ పవార్ మృతిపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన కామెంట్లు చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లీడర్లందరూ ఎమర్జెన్సీ పనులు ఉన్నప్పుడు విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణిస్తుంటారు. ఇలా ప్రమాదాలు చోటు చేసుకోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం. ఈ యాక్సిడెంట్ అసాధారణమైంది.
విమానం ఎందుకు కూలిపోయిందనే దానిపై సమగ్ర విచారణ జరపాలి. అహ్మదాబాద్‌లో భారీ విమానం ఎలా కూలిపోయిందో మనం చూశాం. అజిత్ పవార్ ప్రయాణించింది చాలా చిన్న విమానం. ఇలా ఎందుకు జరిగింది? అజిత్ పవార్ ఒక అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తగా, ప్రజల పట్ల నిబద్ధత కలిగిన నాయకుడిగా గుర్తుండిపోతారు’’ అని ఖర్గే కొనియాడారు. అజిత్ పవార్ మృతి చాలా బాధాకరమని, ఈ కష్టసమయంలో పవార్ కుటుంబ సభ్యులకు, ఆయన మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు రాహుల్ ప్రకటించారు.
పవార్ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. విమాన ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని అఖిలేశ్ యాదవ్, మాయావతి, సంజయ్ రౌత్ ఆరోపించారు. అజిత్ పవార్ మరణం వెనుక కుట్ర దాగి ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరారు.
గతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలు..
సంజయ్‌గాంధీ: మాజీ పీఎం ఇందిరా గాంధీ కొడుకు సంజయ్ గాంధీ 1980లో ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. ఏరోబాటిక్స్ సమయంలో మినీ ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతుండగా విమానం అదుపుతప్పి కుప్పకూలడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
మాధవరావు సింధియా: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి మాధవరావు సింధియా ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా విమానం కూలడంతో ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో 2001లో ఈ ప్రమాదం జరిగింది.
జీఎంసీ బాలయోగి: హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి మృతి చెందారు. 2002లో కృష్ణా జిల్లా కైకలూరు దగ్గరలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చెరువులో కూలిపోయింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయి చనిపోయారు. 2009లో రోడ్డుషో కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఓం ప్రకాశ్ జిందాల్ (ఓపీ జిందాల్): ప్రముఖ పారిశ్రామికవేత్త, హర్యానా సీఎం ఓం ప్రకాశ్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. 2005లో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మహారాష్ట్రలో కూలిపోయింది.
ఎన్‌వీఎన్ సోము: రక్షణ శాఖ సహాయ మంత్రి ఎన్‌వీఎన్ సోము 1997లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అరుణాచల్ ప్రదేశ్‌లో సైనిక పర్యటనలో ఉండగా హెలికాప్టర్ కుప్పకూలింది.
బిపిన్ రావత్
మన దేశ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ 2021 డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదంలో ఆయన భార్య మధులిక రావత్, మరో 11 మంది సైనిక అధికారులు మరణించారు. ఈ ఘటన మానవ తప్పిదం వల్ల జరిగిందని రక్షణ శాఖ కమిటీ ధ్రువీకరించింది.
