- 2026 ఖరీఫ్ సీజన్ కు రూ.41,534 కోట్లకు కేంద్రం ఆమోదం
- పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నిర్ణయం
- ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ
న్యూఢిల్లీ: రైతులకు కేంద్రం ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఫోస్ఫాటిక్ అండ్ పొటాసిక్ (పీ అండ్ కే) ఎరువులపై సబ్సిడీని 2026 ఖరీఫ్ సీజన్ కు 12 శాతానికి పెంచింది. దీంతో ఈ మొత్తాన్ని రూ.41,534 కోట్లకు పెంచినట్లయింది. పీ అండ్ కే ఫర్టిలైజర్లపై సబ్సిడీ 2025 సీజన్ కు రూ.37,216 కోట్లు ఉండగా.. ఈసారి అది రూ.4,318 కోట్లకు పెరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల ఒకటి నుంచి సబ్సిడీ రేట్లు అమల్లోకి వస్తాయి. ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు ఆ రేట్లు అమల్లో ఉంటాయి. నైట్రోజన్ పై రాయితీ కిలోకు రూ.47.32, ఫాస్ఫేట్ పై కిలోకు రాయితీ రూ.52.76, సల్ఫర్ పై సబ్సిడీ రూ.3.16గా కేబినెట్ నిర్ణయించింది. పొటాష్ పై మాత్రం సబ్సిడీని యథాతథంగా కిలోకు రూ.2.38గానే ఉంచింది. న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ (ఎన్ బీఎస్) పథకం కింద పీ అండ్ కే ఎరువులపై మొత్తం 28 గ్రేడ్లకు (రకాలు) సబ్సిడీని విస్తరించారు. 2010 ఏప్రిల్ 1 నుంచి ఈ రాయితీని అమలు చేస్తున్నారు.
కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. మీడియాతో మాట్లాడారు. గత ఖరీప్ తో పోలిస్తే ఈసారి సబ్సిడీని రూ.4,318 కోట్లకు పెంచామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో డై-అమోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) ధరలు కొవిడ్ కాలం నుంచి భారీగా పెరిగినా.. రైతులకు 50 కిలోల బస్తా ధరను రూ.1,350 వద్ద స్థిరంగా ఉంచామని చెప్పారు. కొవిడ్, పశ్చిమాసియాలో యుద్ధం వంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నదని, వారికి రక్షణ కవచంలా నిలుస్తున్నదని పేర్కొన్నారు.
అదనపు నిర్ణయాలు
కేబినెట్ కొన్ని అదనపు నిర్ణయాలు కూడా తీసుకుంది. ప్రపంచ మార్కెట్ ధరల మార్పులను ఎదుర్కొనడం, దిగుమతి చేసుకునే ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ కు రక్షణ చర్యలు తీసుకోవడం, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కు రవాణా సబ్సిడీ కొనసాగించడం, దేశీయంగా తయారయ్యే అమోనియం సల్ఫేట్‌ను కూడా ఎన్ బీఎస్ పథకంలో చేర్చడం వంటి నిర్ణయాలను కేబినెట్ తీసుకుంది.
జైపూర్ మెట్రో ప్రాజెక్ట్ ఫేస్ 2కూ ఆమోదం
జైపూర్ మెట్రో ప్రాజెక్ట్ ఫేస్ 2కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 41 కిలోమీటర్ల కారిడార్ లో రూ.13 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. మొత్తం 36 స్టేషన్లను నిర్మించనున్నారు. రాజస్తాన్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఎంఆర్ సీఎల్) ఈ ప్రాజెక్టును నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాజస్తాన్ ప్రభుత్వం ఉమ్మడిగా 50:50 నిష్పత్తిలో ఈ ప్రాజెక్టు చేపట్టాయి.
