బొల్లారంలో ఖేలో ఇండియా స్టేడియం ఏర్పాటు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బొల్లారంలో ఖేలో ఇండియా స్టేడియం ఏర్పాటు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  •     ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగు: క్రీడాకారులకు మెరుగైన వసతులతో కూడిన స్టేడియం అందించాలన్న లక్ష్యంతో బొల్లారం డివిజన్ పరిధిలో రూ.30 కోట్లతో ఖేలో ఇండియా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదనలు పంపినట్లు  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పటాన్​చెరులోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఖాసీం బేగ్, బొల్లారం డిప్యూటీ కమిషనర్ కిషన్ తో స్టేడియం ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బొల్లారం డివిజన్ పరిధిలో స్టేడియం ఏర్పాటు కోసం గతంలోనే ఐదున్నర ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. ఈ స్థలంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఖేలో ఇండియా స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతున్నామని తెలిపారు. 

రూ.9.30 కోట్లతో సింథటిక్ ట్రాక్, రూ.14 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని పాటి శివారులో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద స్టేడియాన్ని అభివృద్ధికి రూ. 20 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. త్వరలో నిధులు మంజూరు కాబోతున్నాయన్నారు. 

ఈ స్టేడియం పరిధిలో రూ.10 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, రూ.3.15 కోట్లతో స్విమ్మింగ్ పూల్, రూ.6.50 కోట్లతో సింథటిక్ ట్రాక్,  రూ.35 లక్షలతో బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. పటాన్​చెరు మైత్రి మైదానానికి ఖేలో ఇండియా కబడ్డీ అకాడమీ మంజూరు అయిందన్నారు. 20 ఏళ్ల లోపు బాల, బాలికలు కబడ్డీ క్రీడలో శిక్షణ పొందవచ్చని సూచించారు. జనవరి నెలలో అకాడమీ ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.