ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్
  •     డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు: సీఎం రేవంత్‌‌‌‌
  •     మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026  పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి  ఆదేశించారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే ఈ పోటీలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సూచించారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మంగళవారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెఆర్డీలోని బోధి పెవిలియన్‌‌‌‌లో ఖేలో ఇండియా యూత్‌‌‌‌ గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

హైదరాబాద్‌‌‌‌లోని స్టేడియాల్లో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు తగ్గట్టుగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు  సంబంధించిన ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని తెలిపారు. 

తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్‌‌‌‌తో పాటు జాతీయస్థాయి క్రీడా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌‌‌‌లో భాగంగా 20 రకాల స్పోర్ట్స్‌‌‌‌కు సంబంధించిన పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో క్రీడా విభాగాల వారీగా పోటీ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా నిర్వహణ ఉండాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, శాట్స్​ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌‌‌‌ రంజన్,శాట్స్ ఎండీ సోనీబాల దేవి పాల్గొన్నారు.