కొత్త కార్లు.. హ్యాకింగ్​ ముప్పు

కొత్త కార్లు.. హ్యాకింగ్​ ముప్పు
  •  సైబర్​ అటాక్​ జరిగితే వేలాది మంది చనిపోయే ప్రమాదం
  •  అమెరికాకు చెందిన వినియోగదారుల నిఘా సంస్థ నివేదిక

కొత్తగా కారు కొని హాయిగా హ్యాపీగా జాలీ రైడ్​ చేస్తే ఆ ఆనందమే వేరు. వైఫైకి కనెక్ట్​ చేసుకుని చెవులకు వినసొంపైన మ్యూజిక్​ వింటూ వెళితే వచ్చే మజా మస్తుంటది. కానీ, ఆ ఆనందానికి బ్రేకులు వేసేలా కొత్త కార్లు ఈజీగా హ్యాక్​ అయ్యే ముప్పు పొంచి ఉంది. కంపెనీలు కార్లలో పెడుతున్న సాఫ్ట్​వేర్లు హ్యాకర్లు దాడి చేసేలా ఉన్నాయి. మాస్​ సైబర్​ అటాక్​ జరిగితే వేలాది ప్రాణాలు రోడ్డుకు బలయ్యే ప్రమాదముంది. ఈ సంచలన విషయాన్ని అమెరికాలోని లాస్​ఏంజిలిస్​కు చెందిన వినియోగదారుల నిఘా సంస్థ తేల్చింది. ‘కిల్​ స్విచ్​: వై కనెక్టెడ్​ కార్స్​ కెన్​ బీ కిల్లింగ్​ మెషీన్స్​ అండ్​ హౌ టు టర్న్​ దెమ్​ ఆఫ్​’ పేరిట నివేదిక విడుదల చేసింది. కార్ల పరిశ్రమలోని 20 నిఘా వ్యక్తులతో ఐదు నెలల పాటు అధ్యయనం చేయించి ఈ నివేదికను తయారు చేసింది. ‘‘సేఫ్టీ క్రిటికల్​ సిస్టమ్స్​ను ఇప్పుడు బాగా ఇంటర్నెట్​కు అనుసంధానిస్తున్నారు. కానీ, కంపెనీలు మాత్రం సరైన భద్రతా చర్యలు లేకుండానే ఆ సిస్టమ్స్​ను తయారు చేస్తున్నాయి. దాని వల్ల పెద్ద సంఖ్యలో హ్యాక్​ జరిగినప్పుడు కనీసం డిస్​కనెక్ట్​ చేయడానికి వీలు లేకుండా పోతుంది” అని నివేదిక పేర్కొంది. ఆ విషయం కంపెనీలకు తెలిసినా నిమ్మకు నీరెత్తనట్టే ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సేఫ్టీని పక్కనబెట్టి లాభాల కోసమే పాకులాడుతున్నాయని వెల్లడించింది. ఇంజన్​ను స్టార్ట్​ చేయడం దగ్గర్నుంచి, ఏసీని ఆన్​ ఆఫ్​ చేయడం, లొకేషన్​ను చెక్​ చేసుకోవడం వంటివన్నీ స్మార్ట్​ఫోన్​ ద్వారా చేసుకోవచ్చని, కాబట్టి ఇంటర్నెట్​లో హ్యాకర్లు వాటిని ఈజీగా హ్యాక్​ చేయడానికి వీలుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే అన్ని కొత్త వాహనాల్లోనూ ‘ఇంటర్నెట్​ కిల్​ స్విచ్​ పెట్టాలి. కొత్త మోడళ్లలో సేఫ్టీ క్రిటికల్​ వ్యవస్థలను ఇంటర్నెట్​ ఇన్ఫోటెయిన్మెంట్  నుంచి తీసేయాలి” అని సిఫార్సు చేసింది. ప్రజాప్రతినిధులు, కార్ల కంపెనీలు వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.