కిమ్ జాంగ్ హెల్త్ కండిషన్ సీరియస్ ?

కిమ్ జాంగ్ హెల్త్ కండిషన్ సీరియస్ ?
  • సీఎన్ఎన్ న్యూస్ కథనం…స్పందించని నార్త్ కొరియా

న్యూయార్క్ : నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందా? అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నారా ? అమెరికా కు చెందిన సీఎన్ఎన్ అవుననే చెబుతోంది. కిమ్ జాంగ్ పరిస్థితి విషమంగా ఉందంటూ కథనాన్ని ప్రచురించింది. దీంతో కింగ్ జాంగ్ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 15న తన తాత, నార్త్ కొరియా జాతిపిత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ హాజరుకాలేదు. అత్యంత వేడుకగా జరిపే ఈ ఉత్సవాలకు హాజరుకానప్పటి నుంచే కిమ్ హెల్త్ కండిషన్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన కార్డియోవాస్య్కులర్ సర్జరీ జరిగిందంటూ వార్తలు వెలువడ్డాయి. తాజాగా సీఎన్ఎన్ కథనంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. నార్త్ కొరియా వ్యవహారాలు చూసే ఓ అమెరికా అధికారి ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఎన్ఎన్ ఈ కథనాన్ని రాసింది. దీనిపై వైట్ హౌజ్ అధికారులు స్పందించేందుకు నిరాకరించారు. కార్డియోవాస్క్యూలర్ సర్జరీ తర్వాత కిమ్ అత్యంత ప్రమాద స్థితికి చేరారని సీఎన్ఎన్ కథనంలో పేర్కొంది. సౌత్ కొరియా కేంద్రంగా నడిచే డెయిలీ నార్త్ కొరియా అనే వార్తా సంస్థ మాత్రం భిన్నంగా రిపోర్ట్ చేసింది. సర్జరీ తర్వాత కోలుకుంటున్నారని తెలిపింది. దీంతో కిమ్ హెల్త్ కండిషన్ పై గందరగోళం నెలకొంది. నార్త్ కొరియా మాత్రం కిమ్ ఆరోగ్య పరిస్థితి పై ఇప్పటి వరకు స్పందించలేదు.
ఊహాగానాలు వద్దు
కిమ్ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అనుమానాస్పద యాక్టివిటీ తమ దృష్టికి రాలేదని సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం బ్లూ హౌజ్ తెలిపింది. సీఎన్ఎన్ కథనంలో ఎవరో అమెరికా అధికారి చెప్పారంటూ రాశారని…అదే నెట్ వర్క్ కు కొంతమంది అమెరికా అధికారులు కిమ్ ఆరోగ్య పరిస్థితిని ఇప్పుడే అంచనా వేయలేమని చెప్పారని ప్రకటించింది. నార్త్ కొరియా ప్రకటించే వరకు అనవసర ఊహాగానాలు చేయవద్దంటూ సూచించింది.